సినిమాలు అన్నాక హిట్లు, ఫట్లు కామన్. కానీ లైగర్ ఫ్లాప్ మాత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇమేజ్‌ను భారీగా డ్యామేజ్ చేసేసింది. విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా ఎఫెక్ట్ పూరిపై గట్టిగానే పడింది. అసలు పూరితో సినిమాలు చేసే హీరోలే లేరంటూ.. ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ పూరి అంటే ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత స్పీడ్‌గా కిందకి పడిపోతాడో.. అంతకుమంచి డబుల్ ఫోర్స్‌తో పైకి వస్తాడు. అందుకే ఈసారి డబుల్ ఇస్మార్ట్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అది కూడా తన ఫార్మాట్‌లోనే రాబోతున్నాడు. లైగర్ కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించిన పూరి.. ఇప్పుడు సంవత్సరం లోపే సినిమా కంప్లీట్ చేసి ఆడియెన్స్ ముందుకి తీసుకురాబోతున్నాడు. ఇటీవలె ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అది కూడా రిలీజ్ డేట్‌తో సహా ప్రకటించాడు.
వచ్చే మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేయనున్నట్టు.. అనౌన్స్మెంట్ రోజే చెప్పేశాడు. ప్రస్తుతం పూరీ ఈ సినిమా స్క్రిప్ట్‌పైనే ఫుల్లుగా ఫోకస్ చేశాడు. అయితే ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమా షూటింగ్ జులై నెలలో స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. జులైలో లాంఛనంగా మొదలుపెట్టి, ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడట పూరి. ఆ తర్వాత రెండు, మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని.. ఎట్టి పరిస్థితుల్లోను సమ్మర్ రేసులో సినిమాను నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం రామ్, బోయపాటి శ్రీనుతో కలిసి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 15న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి జూలైలో రామ్, పూరి ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవనున్నాడని చెప్పొచ్చు. మరి డబుల్ ఇస్మార్ట్‌తో పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.