టైటిల్ చూసి.. ‘కొరటాల శివకి, సర్కారు వారి పాటకు లింకేంటి?’ అని అనుకుంటున్నారా! ప్రత్యక్షంగా లేదు కానీ, పరోక్షంగా మాత్రం లింక్ ఉంది. ఈ సినిమా కథను మహేశ్ బాబు వద్దకు తీసుకెళ్ళడంలో పరశురామ్‌కి సహాయం చేసింది కొరటాల శివనే! అందుకే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు పరశురామ్! ఆరోజు ఆయన సహాయం చేయడం వల్లే ఇప్పుడు ఈ సర్కారు వారి పాట ఇంతదాకా వచ్చిందని తెలిపాడు.
ఇక మహేశ్‌కి కథ చెప్పడానికి ముందు తాను చాలా భయపడ్డానని, మొదటి ఐదు నిమిషాల స్టోరీ నరేట్ చేశాక మహేశ్ ఫేస్‌పై ఓ చిరునవ్వు చూశానని, తనని నమ్మి అవకాశం ఇచ్చినందుకు మహేశ్‌కి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నాడు. అంతేకాదు.. తన విజన్‌ను వెండితెరపై తీసుకువెళ్ళడంలో ఎక్కడా రాజీ పడకుండా తనకు అండగా నిలిచిన, తాను అడిగినదంతా సిద్ధం చేసి ఇచ్చిన నిర్మాతలకు పరశురామ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమా కోసం ప్రతిఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, తమన్ అయితే అద్భుతమైన సంగీతం ఇచ్చాడని కొనియాడాడు. రీ-రికార్డింగ్ కూడా బాగా జరుగుతోందని చెప్పిన పరశురామ్.. తాము మే 12వ తేదీన కచ్ఛితంగా బ్లాక్‌బస్టర్ ఇస్తున్నామని బల్లగుద్దిమరీ చెప్పాడు.
కాగా.. పోస్టర్స్ విడుదల అవుతున్నప్పటి నుంచే ఈ సినిమాపై క్రమంగా పెరుగుతూ వస్తుండగా, ట్రైలర్ రిలీజయ్యాక అవి తారాస్థాయికి చేరుకున్నాయి. పోకిరి తర్వాత వింటేజ్ మహేశ్ బాబు కనిపించడంతో, ఈ చిత్రంపై ఆడియన్స్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. తాము ఎలాగైతే మహేశ్‌ని చూడాలనుకుంటున్నామో, అలాగే ట్రైలర్‌లో కనిపించడంతో, సినిమా రిలీజ్ కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. చూస్తుంటే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తాండవం చేయడం ఖాయంలా కనిపిస్తోంది.
