Site icon NTV Telugu

God Father: ‘లూసిఫర్’లో లేనిది ఇందులో ఏముందంటే..

Mohan Raja

Mohan Raja

God Father:’హనుమాన్ జంక్షన్’ మూవీ కోసం దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా! మళ్ళీ ఇంతకాలానికి అతనో తెలుగు సినిమాను డైరెక్ట్ చేశాడు. విశేషం ఏమంటే అందులో ఇద్దరు మెగా స్టార్స్ నటించారు. ఒకరు చిరంజీవి కాగా మరొకరు సల్మాన్ ఖాన్. అలానే సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం ఇందులో కీలక పాత్ర పోషించింది. దసరా కానుకగా ఈ నెల 5న జనం ముందుకు వస్తున్న ఈ మూవీ గురించి దర్శకుడు మోహన్ రాజా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

‘గాడ్ ఫాదర్’ మూవీ ఛాన్స్ గురించి చెబుతూ, ”నిర్మాత ఎన్వీ ప్రసాద్ గారు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నేనంటే చాలా ఇష్టం. నన్ను మళ్ళీ తెలుగులోకి రమ్మని పిలిచేవారు. ఒకసారి మహేశ్ బాబు దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. ‘తని వరువన్’ నుండి నాకు చరణ్ తో పరిచయం ఏర్పడింది. ‘ధ్రువ -2’ గురించి చర్చలు జరుపుతున్న సమయంలో ‘లూసిఫర్’ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిగా ఎన్వీ ప్రసాద్ గారే నా పేరుని సూచించారు. చరణ్ బాబు, చిరంజీవి గారికి నచ్చింది. ఫోన్ చేసి పిలిపించారు. వారిని కలిసే ముందే ‘లూసిఫర్’ ని చూశాను. అందులో నాకు ఒక కొత్త కోణం దొరికింది. అదే చిరంజీవి గారితో పంచుకున్నాను. ఆ కోణం చిరంజీవిగారికి చాలా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది” అని అన్నారు.

మాతృకలోని కథను అలానే తీసుకుని ఫ్రెష్ స్క్రీన్ ప్లేను చేశానని మోహన్ రాజా తెలిపారు. ఆ ముచ్చట్లు వివరిస్తూ, ”’లూసిఫర్’లో లేని ఒక కోణం ఇందులో వుంటుంది. కథని అలానే వుంచి ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాను. ఇందులో హీరోతో పాటు మరో పది పాత్రలు కూడా గెలుస్తాయి. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో వుంటాయి. ఈ పాత్రలు చాలా సర్ ప్రైజింగ్ గా వుంటాయి. చిరంజీవి, సల్మాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాధ్, మురళి శర్మ, సునీల్, సముద్రఖని, షఫీ, బ్రహ్మాజీ.. ఇలా ఈ పాత్రలన్నీ ప్రేక్షకులని అరెస్ట్ చేస్తాయి” అని చెప్పారు.

‘లూసిఫర్’లో మోహన్ లాల్ పాత్ర నిడివితో పోల్చితే చిరంజీవి పాత్ర ఎక్కువ ఉంటుందని చెబుతూ, ”2 గంటల 50 నిమిషాల ‘లూసిఫర్’ లో మోహన్ లాల్ గారు 50 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. గాడ్ ఫాదర్ లో చిరంజీవి గారు 2 గంటల పాటు కనిపిస్తారు. ఆయన కనిపించని సీన్స్ లో కూడా ఆయన ప్రజన్స్ వుంటుంది. దీని ప్రకారం ఎలాంటి మార్పులు చేశామో మీరు అర్ధం చేసుకోవచ్చు. అలాగే ‘గాడ్ ఫాదర్’ కంప్లీట్ ఫాస్ట్ పెస్డ్ గా వుంటుంది. చిరంజీవి గారి ఇమేజ్ కి తగ్గ కథ. ఈ కథకి సరిపడే ఇమేజ్ వున్న హీరోలు ఇండియాలో ఓ ముగ్గురు మాత్రమే వుంటారు. ఇక సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే… ‘లూసిఫర్’లో పృథ్వీరాజ్ ఆ పాత్రను చేశారు. ఆయన అక్కడ పెద్ద స్టార్. ‘గాడ్ ఫాదర్’కి కూడా ఒక పెద్ద స్టార్ అవసరం పడింది. అయితే ఇది గ్లామర్ కోసం కాదు. ఇందులో హీరో పాత్ర సర్వాంతర్యామి. ఎవరు ఏం గేమ్ ఆడిన ఆయన ఆడే నాటకంలో పాత్రధారులే అంతా. అలాంటి పాత్ర కోసం చెప్పడానికి ఒక పెద్ద స్టార్ కావాలి. ఆయన ఇంట్లో చాలా మంచి పెద్ద స్టార్లు వున్నారు. ఆ పాత్ర గురించి వాళ్ళు చెప్పడం కంటే బయటవారు అయితే మరింత ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుందని భావించాను. చరణ్ బాబు, సల్మాన్ స్నేహితులని తెలిసింది. చరణ్ బాబు కి చెప్పడం ఆయనే అంతా చూసుకోవడం జరిగింది. సల్మాన్ ఖాన్ స్క్రీన్ ప్రజన్స్ అదిరిపోతుంది. సల్మాన్ ఖాన్ గారు ఆయన సీన్స్ చూశారు. చాలా హ్యాపీగా ఫీలయ్యారు” అని అన్నారు.

‘గాడ్ ఫాదర్’ సీక్వెల్ గురించి తెలుపుతూ, ”మలయాళంలో ‘లూసిఫర్- 2’ మొదలైంది. ప్రస్తుతం నా దృష్టి మాత్రం ‘గాడ్ ఫాదర్’ పైనే వుంది. అయితే దీని సీక్వెల్ కి మంచి కంటెంట్ వుంది. ‘తని వరువన్’ సీక్వెల్ ఆలోచన కూడా వుంది” అని చెప్పారు.

Exit mobile version