NTV Telugu Site icon

డిషుమ్ డిషుమ్… కె.ఎస్.ఆర్.దాస్

ksr das

ksr das

శతాధిక కథాచిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనులు తెలుగునాటనే అధికంగా ఉండడం విశేషం. వారిలో యాక్షన్ మూవీస్ తో అధికంగా మురిపించిన కె.ఎస్.ఆర్.దాస్ స్థానం ప్రత్యేకమైనది. చిత్రసీమలోని 24 శాఖలలో పట్టున్న దర్శకులు అరుదుగా కనిపిస్తారు. కె.ఎస్.ఆర్. దాస్ అన్ని శాఖల్లోనూ పట్టు సాధించాకే ‘లోగుట్టు పెరుమాళ్ళ కెరుక’తో దర్శకుడయ్యారు. ఆపై ‘రాజయోగం’ చూడాలనుకున్నాడు ‘రాజసింహ’ తీశాడు. ‘గండరగండడు’ కాసింత కరుణించాడు. తరువాత ‘గందరగోళం’లో పడ్డాడు దాసు. ఆ సమయంలో కృష్ణ ద్విపాత్రాభినయంతో తెరకెక్కించిన ‘టక్కరి దొంగ – చక్కని చుక్క’ దాస్ ను యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ గా నిలిపింది

కె.ఎస్.ఆర్.దాస్ పూర్తి పేరు కొండా సీతారామ‌దాస్. ఎడిట‌ర్ గా ప‌నిచేసే రోజుల్లోనే త‌న పేరును కుదించుకున్నారు. ఆయ‌న‌ సినిమా అనగానే యాక్షన్ సీన్స్ అధికంగా ఉంటాయనే పేరు సంపాదించారు. ఓ ఫైట్ కు మరో ఫైట్ కు సంబంధం లేకుండా ఏదో ఒక స్కీమ్ ప్రకారం యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించేవారు దాస్. సినిమాకు సంబంధించిన అన్ని అంశాలపై దాస్ కు మంచి పట్టు ఉండేది. అందువల్ల ఓ నెల రోజుల్లోనే మొత్తం సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసేవారు దాస్. ఆయనలోని వేగం గమనించిన ఎందరో తమిళ, కన్నడ, హిందీ నిర్మాతలు సైతం దాస్ తో సినిమాలు నిర్మించారు. నిర్మాత పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి వచ్చేలా నిర్మాణదశ నుండే ప్రణాళికలు రూపొందించేవారు దాస్. దాంతో నిర్మాతలకు ఏ మాత్రం సమస్యలు ఎదురయ్యేవి కావు. కె.ఎస్.ఆర్.దాస్ తో సినిమా నిర్మించే నిర్మాతలకు ఫైనాన్సియర్స్ కూడా చప్పున పైకం అందించేవారు. అలా అన్ని భాషల్లో వందకు పైగా చిత్రాలు తీయగలిగారు దాస్.

‘టక్కరి దొంగ – చక్కని చుక్క’తో మొదలైన కృష్ణ, కె.ఎస్.ఆర్.దాస్ కాంబో తెలుగు చిత్రసీమలో పలు యాక్షన్ మూవీస్ తో సందడి చేసింది. తెలుగు తెరపై తొలి కౌబోయ్ చిత్రంగా కృష్ణ సోదరులు నిర్మించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ నిలచింది. ఈ చిత్రాన్ని కె.ఎస్.ఆర్.దాస్ తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కృష్ణతో దాస్ తెరకెక్కించిన “బంగారు కుటుంబం, ప్రేమజీవులు, ఈనాటి బంధం ఏనాటిదో” వంటి కుటుంబకథా చిత్రాలూ ఉన్నాయి. అయితే అవి అంతగా అలరించలేకపోయాయి. ఫ్యామిలీ సెంటిమెంట్ తో రూపొందిన ‘మామాఅల్లుళ్ళ సవాల్’ ఆకట్టుకుంది. ఇక వారి కలయికలో రూపొందిన ” హంతకులు-దేవాంతకులు, కత్తుల రత్తయ్య, మంచివాళ్ళకు మంచివాడు, భలే దొంగలు, దొంగలకు దొంగ, అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే, ఏజెంట్ గోపి, రహస్య గూఢచారి” వంటి యాక్షన్ మూవీస్ మురిపించాయి. కృష్ణ, దాస్ కాంబోలో వచ్చిన చివరి చిత్రం ‘ఇన్ స్పెక్టర్ రుద్ర’ . కృష్ణను యాక్షన్ హీరోగా నిలపడంలో కె.ఎస్.ఆర్.దాస్ పాత్ర ఎంతయినా ఉందని చెప్పక తప్పదు.

కె.ఎస్.ఆర్. దాస్ కు పౌరాణిక నటబ్రహ్మ యన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. ఆయనతో ఓ పౌరాణిక చిత్రం తీయాలని ఆశించారు. అయితే దాస్ కెరీర్ లో ఒకే ఒక్క ‘యుగంధర్’ కోసం యన్టీఆర్ తో పనిచేసే అవకాశం లభించింది. ‘డాన్’ హిందీ రీమేక్ గా రూపొందిన ‘యుగంధర్’ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించింది. ఇక కన్నడ నాట విష్ణువర్ధన్ హీరోగా దాదాపు 14 చిత్రాలు తెరకెక్కించారు దాస్. చిరంజీవి వర్ధమాన నటునిగా సాగుతున్న రోజుల్లో దాస్ దర్శకత్వంలో నటించిన “బిల్లా-రంగా, పులి-బెబ్బులి, రోషగాడు” చిత్రాలు అలరించాయి. తన తొలి చిత్ర కథానాయకుడు శోభన్ బాబుతో ‘గిరిజా కళ్యాణం’ నవలా చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే విజయలలిత, జ్యోతిలక్ష్మి వంటి వారితో ప్రధాన పాత్రలు పోషింపచేసి యాక్షన్ మూవీస్ నూ రూపొందించారు దాస్. 2000లో దాస్ దర్శకత్వంలో చివరి చిత్రంగా ‘నాగులమ్మ’ రూపొందింది. ఏది ఏమైనా కె.ఎస్.ఆర్.దాస్ పేరు వినగానే తెలుగు సినిమా అభిమానులకు ముందుగా ఆయన యాక్షన్ మూవీస్ గుర్తుకు రాకమానవు.

ఈ నాటికీ యాక్ష‌న్ మూవీస్ తెర‌కెక్కించే క‌న్న‌డ ద‌ర్శ‌కులు దాస్ పేరునే స్మ‌రించుకుంటూ ఉంటారు. అదీ క‌న్న‌ద చిత్ర‌సీమ‌లో దాస్ సాధించిన ఘ‌న‌త‌. ఇక తెలుగులో కె.ఎస్.ఆర్.దాస్ పేరు విన‌గానే ఈ నాటికీ డిషుమ్ డిషుమ్... అంటూ సౌండ్ చేసేవారు ఎంద‌రో ఉన్నారు. దానిని బ‌ట్టే దాస్ ఇమేజ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు.