Site icon NTV Telugu

Mega154: టైటిల్ ఇదే.. అఫీషియల్‌గా రివీల్ చేసిన డైరెక్టర్

Mega154 Titlle

Mega154 Titlle

మెగాస్టార్ చిరంజీవి వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో Mega154 ఒకటి. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే.. మిగిలిన రెండు సినిమాలు రీమేక్స్ అయితే, ఇది ఒరిజినల్ కథతో రూపొందుతోంది. పైగా.. ఇందులో 1990ల కాలానికి చెందిన వింటేజ్ చిరుని చూస్తారని బాబీ చెప్పడం, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ వైబ్స్‌ క్రియేట్ చేయడంతో, ఈ సినిమా కోసం ఆందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే.. ఈ సినిమా టైటిల్‌పై చాలారోజుల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను దాదాపు ఫిక్స్ చేశారని మొదట్నుంచీ ప్రచారం జరుగుతోంది కానీ, మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. ఆచార్య ప్రమోషన్స్‌లో చిరు ఈ సినిమా టైటిల్‌ని లీక్ చేసేశారు. యువ దర్శకులతో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. తాను టైటిల్ చెప్పనని అంటూనే ‘వాల్తేర్ వీరయ్య’ అని నోరు జారారు. ఇప్పుడు దర్శకుడు బాబీ తమ సినిమా టైటిల్ అదేనంటూ ధృవీకరించాడు. విజయవాడలో మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన మీటింగ్‌లో.. చిరుతో తాను చేస్తోన్న చిత్రానికి ‘వాల్తేర్ వీరయ్య’ టైటిల్‌ని ఫిక్స్ చేశామని క్లారిటీ ఇచ్చాడు.

కాగా.. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. చిరుతో శృతి జోడీ కట్టడం ఇదే తొలిసారి. దీంతో.. తనయుడితో పాటు తండ్రితోనూ రొమాన్స్ చేసిన కథానాయికల జాబితాలోకి శృతి చేరిపోయింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Exit mobile version