తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ తో యూత్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమా ‘మహా సముద్రం’ విషయంలో తడబడ్డాడు. తాను ఎప్పుడో రాసుకున్న కథను పట్టుకుని పలువురు హీరోల చుట్టూ తిరిగాడు. చాలా మంది ఈ కథను తిరస్కరించారు. అయితే చివరకు అజయ్ భూపతి కథకు శర్వానంద్, సిద్ధార్థ్ పచ్చజెండా ఊపారు. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఆ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చింది. అంతేకాదు… రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ‘మహా సముద్రం’ను నిర్మించింది. కానీ కథలో బలం లేకపోవడం, సన్నివేశాలు ఆసక్తిని కలిగించకపోవడం, పాటలు సైతం నిరాశకు గురిచేయడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు.
ఇక అభిమానులైతే, తమ అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్ గా అజయ్ భూపతికే తెలిపారు. దాంతో తాజాగా అజయ్ భూపతి వారందరికీ ట్విట్టర్ వేదికగా సారీ చెప్పాడు. ‘మీ అంచనాలను అందుకోలేక పోయినందుకు క్షమించండి.. వచ్చేసారి మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో వస్తాను’ అని బదులిచ్చాడు. చాలామంది ‘ఆర్ఎక్స్ 100’ నుండి బయటకు వచ్చి నెక్ట్స్ మూవీ తీయమని సలహా ఇచ్చారు. మరి దానిని అజయ్ భూపతి ఎంతవరకూ పాటిస్తాడో చూడాలి.
