డింపుల్ కపాడియా… ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమంది రసికాగ్రేసరులకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. అప్పటి డింపుల్ అందాలను తలచుకొని ఈ నాటికీ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. “ఎంతోమంది అందగత్తెలు చిత్రసీమలో వెలుగులు విరజిమ్మవచ్చు గాక… డింపుల్ అందం వేసిన బంధాలే వేరు” అంటూ కీర్తిస్తున్న వారూ లేకపోలేదు. పదునాలుగేళ్ళ ప్రాయంలోనే కెమెరా ముందుకు వచ్చింది. 16 ఏళ్ళ సమయానికి ముగ్ధమనోహరంగా ‘బాబీ’లో మురిపించింది. ‘షో మేన్’ రాజ్ కపూర్ తెరకెక్కించిన ‘బాబీ’ పాటలతో అలరించడం ఓ ఎత్తయితే, డింపుల్ పరువాలతో పరవశింపచేయడం మరో ఎత్తు అని చెప్పాలి. ఇందులో టూ పీస్ బికినీలో డింపుల్ తెరపై కనిపించగానే ఎంతోమంది యువకుల లయ తప్పింది. ఆ సీన్ కోసమే మళ్ళీ మళ్ళీ ‘బాబీ’ చిత్రాన్ని చూసిన వారున్నారు. ఆ సినిమాలో ఏ మాత్రం అదరక బెదరక నటించిన డింపుల్ కపాడియా ఉత్తమనటిగా ‘ఫిలిమ్ ఫేర్’ అవార్డును ఎగరేసుకు పోయింది. 16 ఏళ్ళ వయసులో ఫిలిమ్ ఫేర్ నామినేషన్ సంపాదించడమే కాదు, ఉత్తమ నటిగానూ నిలచింది. ఈ నాటికీ అంత పిన్నవయసులో ‘బ్లాక్ లేడీ’ని తమతో తీసుకుపోయిన మరో ముద్దుగుమ్మ కనిపించలేదు. ఇక ‘రుడాలి’లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ డింపుల్ నిలచింది. డింపుల్ అందం చూసి, ఆమె ఇండియన్ కాదనుకొనేవారు చాలామంది. ఆమెలో హాలీవుడ్ అందం దాగివుందని పలువురు అభిమానులు కీర్తించేవారు. అందుకేనేమో నవతరం దర్శకుల్లో తనదైన బాణీ పలికిస్తున్న హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ తన ‘టెనెట్’లో అదే పనిగా డింపుల్ ను ఎంచుకున్నారు అనిపిస్తుంది.
ఉవ్వెత్తున ఎగసి… ఉస్సూరుమని కూలి…
డింపుల్ కపాడియా, ఆమె చెల్లెలు సింపుల్ కపాడియా ఇద్దరూ చిన్నతనం నుంచీ తెగ సినిమాలు చూసేవారు. వారి కన్నవారు ధనవంతులు కావడంతో, వారు ఆడిందే ఆటగా సాగింది. ఎలాగైనా సరే తానూ సినిమా రంగంలో ఓ వెలుగు వెలగాలని డింపుల్ చిన్నతనంలోనే నిర్ణయించుకుంది. పైగా ఆమె తండ్రి కపాడియాకు పలువురు హిందీ చిత్ర ప్రముఖులతో సత్సంబంధాలు ఉండేవి. అందువల్ల కొన్ని చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడానికీ డింపుల్ కు అవకాశాలు వచ్చాయి. కానీ, అవేవీ కార్యరూపం దాల్చలేదు. టీనేజ్ లో అడుగు పెట్టగానే డింపుల్ కు తెరపై కనిపించాలన్న తపన మరింత ఎక్కువయింది. అదే సమయంలో డింపుల్ తండ్రి స్నేహితుడు ఒకరికి రాజ్ కపూర్ హీరోయిన్ల వేటలో ఉన్నట్టు తెలిసింది. అతని ద్వారా రాజ్ కపూర్ చేసిన మేకప్ టెస్ట్ కు డింపుల్ హాజరయింది. ఆ సమయంలో ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలు. కొద్ది రోజులకే రాజ్ కపూర్ తన తనయుడు రిషి కపూర్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘బాబీ’ చిత్రాన్ని ఆరంభించారు. అందులో హీరోయిన్ ‘బాబీ’గా డింపుల్ ను ఎంచుకున్నారు. రాజ్ కపూర్ లాంటి షో మేన్ ఎంపిక చేయడంతో ‘బాబీ’ సినిమా విడుదల కాకముందే, డింపుల్ గురించిన ప్రచారం హిందీ చిత్రసీమలో విశేషంగా సాగింది. అది అలా అలా వెళ్ళి ఆ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాను చేరింది. అతను తొలి చూపులోనే డింపుల్ పై మనసు పారేసుకున్నాడు. అప్పటికే సూపర్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న రాజేశ్ ఖన్నాను చూశాక, డింపుల్ కూడా ఇష్టపడింది. దాంతో తనకంటే వయసులో 15 ఏళ్ళు పెద్దవాడయినా, రాజేశ్ ఖన్నాను వివాహమాడటానికి అంగీకరించింది డింపుల్. ‘బాబీ’ రిలీజ్ కు కొన్ని నెలల ముందే రాజేశ్, డింపుల్ పెళ్ళాడారు. పెళ్ళయ్యాక డింపుల్ సినిమాలకు దూరంగా ఉంది. ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా పుట్టిన తరువాత కూడా రాజేశ్, డింపుల్ మధ్య అన్యోన్యబంధమే ఉందని చెప్పవచ్చు. ఎందువల్లో రాజేశ్, డింపుల్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దాంతో పరస్పర అంగీకారంతోనే విడిపోయారు.
డింపుల్ బాణీ…
ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత కూడా డింపుల్ లోని అందం గంధాలు పూసేలా ఉండేది. దాంతో డింపుల్ నటిస్తే బాగుంటుందని అభిమానులు ఆశించారు. డింపుల్ కూడా తాను నటించడానికి సిద్ధం అని ప్రకటించింది. అదే సమయంలో మన దర్శకరత్న దాసరి నారాయణ రావు తాను రూపొందించిన ‘బొబ్బిలిపులి’ని హిందీలో ‘జక్మీ షేర్’గా తెరకెక్కిస్తూ ఉన్నారు. అందులో కథానాయికగా డింపుల్ ను ఎంచుకున్నారు. తెలుగులో శ్రీదేవి పోషించిన పాత్రను హిందీలో డింపుల్ కపాడియా ధరించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మరికొన్ని చిత్రాలను అంగీకరించారు డింపుల్. వాటిలో ‘మంజిల్ మంజిల్’ ఒకటి. ఇందులో సన్నీ డియోల్ హీరో. ఈ సినిమా సమయంలోనే సన్నీడియోల్ తో డింపుల్ కు అనుబంధం పెరిగింది. వారిద్దరూ ఆ తరువాత ‘అర్జున్’లోనూ కలసి నటించారు. సహజీవనం సాగించారు. వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. వారి లవ్ ఎఫైర్ ను క్యాష్ చేసుకొనేందుకు నిర్మాతలు, దర్శకులు కూడా సన్నీ, డింపుల్ జోడీని ఎంచుకొనేవారు. హీరో కృష్ణ హిందీలో నిర్మించిన ‘పాతాళభైరవి’లో “చుమ్మా చుమ్మా…” సాంగ్ లో నర్తించీ డింపుల్ కపాడియా వార్తల్లో నిలిచారు. తన తొలి హీరో రిషీకపూర్ తో కలసి ‘సాగర్’లో నటించింది. కమల్ హాసన్ మరో హీరోగా నటించిన ‘సాగర్’ అనూహ్య విజయం సాధించింది. అప్పటి నుంచీ తన దరికి చేరిన పాత్రలను అంగీకరిస్తూ డింపుల్ ముందుకు సాగారు. పురుషాధిక్య ప్రపంచలో భర్త అండ లేకపోయినా, రాణించవచ్చునని డింపుల్ నిరూపించారు. ఇక విలక్షణమైన కథాంశంతో రూపొందిన ‘రుడాలి’లో డింపుల్ కపాడియా అభినయం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం ద్వారా బెస్ట్ యాక్ట్రెస్ గా ఆమెకు నేషనల్ అవార్డు లభించింది. మరో విశేషమేమంటే, ఈ సినిమాకు డింపుల్ చెల్లెలు సింపుల్ కపాడియా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఆమెకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా నేషనల్ అవార్డు దక్కింది. అలా అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ ఒకేసారి, ఒకే సినిమాతో జాతీయ అవార్డులు అందుకోవడం చిత్రసీమలో విశేషమనే చెప్పాలి.
విచిత్ర దాంపత్యం!
రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా విభేదించి విడిపోయినా, ఏ నాడూ ఒకరి ఇష్టాలకు మరొకరు అడ్డుగా నిలువలేదు. పిల్లల కోసం ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోలేదు. పార్టీల్లో కలుసుకున్నప్పుడు ఫ్రెండ్స్ లా మాట్లాడుకొనేవారు. రాజేశ్ తనకు నచ్చిన వారితో తిరిగేవాడు. అలాగే డింపుల్ తనకు నచ్చిన సన్నీ డియోల్ తో గడిపింది. 1990లో రాజేశ్ ఖన్నాతో కలసి ‘జై శివ శంకర్’ చిత్రంలో నటించింది. అయితే ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. తరువాత తన భర్త రాజేశ్ ఖన్నా ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయన తరపున ప్రచారం చేసింది డింపుల్. ఈ ఎన్నికలో రాజేశ్ ఖన్నా విజయం సాధించారు. వారి కూతుళ్ళు ట్వింకిల్, రింకీ కన్నవారి బాటలోనే నటనలో అడుగు పెట్టారు. ట్వింకిల్ నటిగా సక్సెస్ చూసింది. తెలుగులో వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘శీను’లో ట్వింకిల్ నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన అక్షయ్ కుమార్ ను ట్వింకిల్ పెళ్ళాడింది. రింకీ ఖన్నా పెళ్ళి కూడా కోరుకున్నవాడితోనే జరిగింది. ఇప్పుడు అమ్మమ్మగా తాను ఎంతో ఆనందంగా ఉన్నానని చెబుతున్నారు డింపుల్ కపాడియా. రాజేశ్ ఖన్నా 2021లో అనారోగ్యానికి గురయినప్పుడు డింపుల్ ఆయన వద్దే ఉన్నారు. చివరి దాకా భార్యగా రాజేశ్ కు సపర్యలు చేశారు.
ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలు పోషిస్తూనే డింపుల్ సాగుతున్నారు. ‘దబంగ్’లో సల్మాన్ ఖాన్ తల్లిగా నటించిన డింపుల్, ‘కాక్ టెయిల్’లో కవితా కపూర్ గా, ‘ఫైండింగ్ ఫ్యానీ’లో రోజీగా, ‘వెల్ కమ్ బ్యాక్’లో మహారాణిగా, ‘టెనెట్’లో ప్రియాసింగ్ గా నటించి మెప్పించారు. రాబోయే “బ్రహ్మాస్త్ర, పఠాన్” సినిమాల్లోనూ డింపుల్ నటిస్తున్నారు. ఇవి కాకుండా, ఆమె నటిస్తోన్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి.
(జూన్ 8న డింపుల్ కపాడియా పుట్టినరోజు)