NTV Telugu Site icon

ట్రాజెడీ కింగ్ … దిలీప్ కుమార్!

dilip kumar

dilip kumar

భారతదేశంలో స్టార్ హీరోస్ గా రాజ్యమేలిన వారిలో అత్యధిక కాలం జీవించిన నటునిగా దిలీప్ కుమార్ చరిత్ర సృష్టించారు. అటు ఉత్తరాదిన కానీ, ఇటు దక్షిణాదిన కానీ స్టార్ హీరోగా రాజ్యమేలిన ఏ గ్రేట్ యాక్టర్ కూడా 98 సంవత్సరాలు జీవించలేదు. ఆ క్రెడిట్ దిలీప్ సాబ్ కే దక్కింది. ఈ యేడాది జూలై 7న దిలీప్ కుమార్ కన్నుమూశారు. డిసెంబర్ 11న దిలీప్ కు 99 ఏళ్ళు పూర్తయి, నూరవ ఏట అడుగుపెట్టి ఉండేవారు. అందువల్ల డిసెంబర్ 11న ఆయన శతజయంతి ఆరంభం కానుంది. వచ్చే సంవత్సరం డిసెంబర్ 11న అది పూర్తవుతుంది.

దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. 1922 డిసెంబర్ 11న పెషావర్ లో ఆయన జన్మించారు. సినిమా రంగంలో అడుగుపెట్టాకే, యూసఫ్ ఖాన్ కాస్తా దిలీప్ కుమార్ గా మారారు. 1944లో బాంబే టాకీస్ నిర్మించిన ‘జ్వార్ బాటా’తో దిలీప్ కుమార్ చిత్రసీమలో ప్రవేశించారు. ఆ తరువాత నుంచీ తన దరికి చేరిన పాత్రలను పోషిస్తూ సాగిన దిలీప్ కుమార్ “జోగన్, బాబుల్, దీదార్, దాగ్, దేవదాస్, నయాదౌర్, ఆన్, యాహుదీ, కోహినూర్, మొఘల్-ఏ-ఆజమ్, ఆజాద్,గంగ-జమున, రామ్ ఔర్ శ్యామ్, ఆద్మీ, గోపీ” వంటి చిత్రాలలో నటించి జనాన్ని అలరించారు. ‘అందాజ్, దేవదాస్, మేలా, మొఘల్ ఏ ఆజమ్’ వంటి చిత్రాలలో భగ్నప్రేమికునిగా నటించిన దిలీప్ ‘ట్రాజెడీ కింగ్’ అనిపించుకున్నారు. దిలీప్ మెథడ్ యాక్టర్ గానూ జేజేలు అందుకున్నారు. రాజ్ కపూర్ తో కలసి ‘అందాజ్’లో నటించిన దిలీప్, దేవానంద్ తో కలసి ‘ఇన్సానియత్’లో అభినయించారు.

దిలీప్ హీరోగా రూపొందిన ‘ఆన్’ ఆ రోజుల్లో అత్యధిక వసూళ్ళు చూసిన చిత్రంగా నిలచింది. ఆ తరువాత ఆ సినిమా రికార్డ్ ను 1960లో దిలీప్ నటించిన ‘మొఘల్ ఏ ఆజమ్’ బ్రేక్ చేసింది. ఈ సినిమా బొంబాయిలో రెండున్నర సంవత్సరాలు ప్రదర్శితమయింది. ఈ చిత్రంలో నాయికగా నటించిన మధుబాలతో దిలీప్ కుమార్ ప్రేమవ్యవహారం సాగింది. ఇద్దరూ ఒకే మతానికి చెందినవారయినా, కొన్ని కారణాల వల్ల వారి ప్రేమ ఫలించలేదు. ఎందువల్లో దిలీప్ అంటే మొదటి నుంచీ మధుబాల తండ్రి అతవుల్లా ఖాన్ కు ఇష్టం ఉండేది కాదు. ‘నయాదౌర్’ షూటింగ్ సమయంలో బి.ఆర్.చోప్రాతో అతవుల్లా ఖాన్ గొడవ పడ్డారు. దాంతో ఆమె స్థానంలో వైజయంతీమాలను నాయికగా తీసుకున్నారు. దిలీప్ సాక్ష్యం కారణంగానే కోర్టులో ‘నయా దౌర్’ చిత్ర ధర్శకనిర్మాత బి.ఆర్.చోప్రాపై కేసులో అతవుల్లా ఖాన్ ఓడిపోయారు. అందువల్ల మధుబాల కూడా దిలీప్ ను ఏవగించుకుంది. అలా తెరపై పలు విషాదాంత ప్రేమకథల్లో నటించిన దిలీప్ కుమార్, నిజజీవితంలోనూ భగ్నప్రేమికుడు అనిపించుకున్నారు. తరువాత 1966లో తన కంటే వయసులో 22 ఏళ్ళు చిన్నదైన సైరాబానును పెళ్ళాడారు. 1981లో ఆస్మా రెహమాన్ అనే ఆమెను పెళ్ళి చేసుకున్నారు. అది గొడవకు దారి తీసింది. ఎంతోమంది దిలీప్ సన్నిహితులు సైరాబానుకు అండగా నిలిచి, అతను చేసింది తప్పు అన్నారు. దాంతో ఆస్మాకు దిలీప్ కొన్ని నెలలకే విడాకులు ఇచ్చారు. చివరి దాకా సైరాబానుతోనే సాగారు.

ఆయన కీర్తి కిరీటంలో ఎన్నెన్నో అవార్డులూ, రివార్డులూ మేలిమి రత్నాలుగా వెలుగులు విరజిమ్మాయి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వరించాయి. ప్రతిష్ఠాత్మక యన్టీఆర్ జాతీయ అవార్డు కూడా ఆయనకు దక్కింది. 2000లో రాజ్యసభకు దిలీప్ కుమార్ ఎంపికయ్యారు. పలుమార్లు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయినా, మళ్ళీ కోలుకొని ఇంటికి చేరేవారు. దాంతో ఆయన ఖచ్చితంగా వంద సంవత్సరాలు జీవిస్తారని అభిమానులు ఆశించారు. కానీ, ఈ ఏడాది జూలై 7న ఆయన తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ మరపురాని మహానటునిగా జనం మదిలో నిలచిపోయారు.