NTV Telugu Site icon

Masooda: హ్యాట్రిక్ ప్రొడ్యూసర్ కు ‘దిల్’ రాజు అభినందనలు!

Masooda

Masooda

Masooda: ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తో వరుస విజయాలను అందుకున్నాడు రాహుల్ యాదవ్ నక్కా! ఆయన నిర్మించిన మూడో సినిమా ‘మసూద’ శుక్రవారం విడుదలై, రోజు రోజుకూ ప్రేక్షకాదరణ పెంచుకుంటూ విజయపథంలో దూసుకు పోతోంది. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. ఈ హారర్ డ్రామాను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విడుదల చేశారు. పాజిటివ్ టాక్ తో ‘మసూద’ దూసుకుపోతున్న సందర్భంగా చిత్ర యూనిట్‌తో రామానాయుడు స్టూడియోస్‌లో మీడియా సమావేశాన్ని ‘దిల్’ రాజు నిర్వహించారు. విశేషం ఏమంటే… ఈ కార్యక్రమానికి ఆయనే యాంకర్‌గా వ్యవహరించి సినిమాకు పనిచేసిన వారందరితో సినిమా విశేషాలను చెప్పించారు.

రెండు గంటల 45 నిమిషాల ఈ సినిమా నిడివిని కొంతైనా తగ్గించమని అడిగినా నిర్మాత అంగీకరించలేదని ‘దిల్’ రాజు ఆరోపించారు. దానికి రాహుల్ యాదవ్ తనదైన బాణీలో సమాధానం చెప్పారు. ఈ హారర్ స్టోరీ విన్నతర్వాత అందులో సోల్ పోకుండా నిర్మించాలని అనుకున్నానని, అందుకే నిడివి విషయంలో రాజీ పడలేదని చెప్పారు. ‘ఎవరికైనా సహాయం చేయడానికి రీజన్ అవసరం లేదు’ అనే పాయింట్ తనకు బాగా నచ్చిందని, అందుకే కమర్షియల్ గా ఆలోచించకుండా వైవిధ్యంగా, నిజాయితీగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశానని చెప్పారు. సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాతే ఓటీటీకి, శాటిలైట్ కు అమ్మాలని తాను భావించానని రాహుల్ అన్నారు. కొంతమంది చెప్పిన మొత్తానికి ఇవ్వడం ఇష్టం లేక సినిమా విజయం మీద ఉన్న నమ్మకంతో వాటిని అమ్మలేదని చెప్పారు.

‘రాహుల్ యాదవ్ తీసిన మొదటి రెండు సినిమాలు చూసిన తర్వాత నిర్మాతగా అతని పేషన్ అర్థమైందని, అందుకే ఒకసారి నిర్మాతల కోసం ఏర్పాటు చేసిన వేడుకలో రాహుల్‌కి ఓ ఆఫర్ ఇచ్చాన’ని దిల్ రాజు అన్నారు. ”నీకు ఇష్టమైన సినిమా తీసుకో.. ఎస్‌విసి బ్రాండ్ ఇస్తాను. వాడుకో” అని చెప్పానన్నారు. నటి సంగీత మాట్లాడుతూ, ”మాములుగా అయితే నాకు హర్రర్ సినిమాలంటే చాలా భయం. పెద్దగా చూడను. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. ఇలాంటి హర్రర్ సినిమాలను ఇంట్లో ఉండి చూస్తే థ్రిల్ రాదు. థియేటర్లలోనే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని పొందగలరు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడండి. బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్, కెమెరా, నటీనటుల కనబరిచిన అభినయం.. ఇలా ప్రతీది థ్రిల్ ఇస్తుంది. నేను ఏదైతే థ్రిల్ అయ్యానో.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అదే ఫీలవుతున్నారు. నాకు ఈ టైమ్‌లో ఇలాంటి అవకాశం ఇచ్చిన నిర్మాత రాహుల్‌ గారికి, నన్నీ పాత్రకు సెలక్ట్ చేసిన సాయిగారికి థ్యాంక్యూ. తిరువీర్, కావ్య, బాంధవి అందరికీ థ్యాంక్స్. మేకప్ లేకుండా చేయాలంటే ఏ ఆర్టిస్ట్‌కి అయినా భయమే. కానీ నేనే థ్రిల్ అయ్యేలా చేశారు కెమెరా మ్యాన్. ప్రశాంత్‌ గారు ఎక్స్‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎంతగానో కృషి చేశారు” అని అన్నారు.

దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ, ”ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు రాహుల్ నాతో షేర్ చేసుకునే వారు. నేను కూడా నిడివి విషయంలో అభ్యంతరం చెప్పాను. కానీ రాహుల్ మొండివాడు. మొండివారు ఎప్పుడూ ఓడిపోరు. అదే ఈ రోజు అతనికి సక్సెస్‌ని ఇచ్చిందని అనుకుంటున్నా. విజువలైజేషన్‌లో సాయికిరణ్ బ్రిలియంట్ పర్సన్. తన విజన్‌ని నగేష్ కెమెరాతో, ప్రశాంత్ ఆర్. విహారి సౌండ్‌తో ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు. నేను ఈ సినిమాని రెండు సార్లు చూశా. గొప్ప ఎక్స్‌పీరియన్స్. ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్ రావాలంటే థియేటర్‌లోనే సినిమా చూడాలి” అని అన్నారు. నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ, ”పదేళ్ళ క్రితం ‘కాంజురింగ్’ అనే సినిమా చూశా.. ఆ తరువాత మళ్లీ ఈ సినిమాలో భయపడ్డా. సాయికిరణ్ ఈ సినిమాను చాలా అందంగా రాశాడు. హారర్ సినిమా కూడా ఎందుకింత అందంగా ఉందీ అంటే.. అది మీరు చూస్తేనే తెలుస్తుంది. ఇలాంటి కథలు రావాలంటే పెద్దవాళ్ల సహకారం కావాలి. సినిమాకు సపోర్ట్ అందించిన ‘దిల్’ రాజుగారికి థ్యాంక్యూ. ఈ సినిమాకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ.. సినిమా చూశాక అందరినీ అభినందించాలని అనిపించింది. తిరువీర్ అంటే నాకు ఈర్ష్య. చాలా మంచి నటుడు. 10 ఏళ్ల క్రితం నేను, తిరువీర్ ప్రయాణం మొదలెట్టాం. ఈ సినిమా సీక్వెల్‌లో నేనే హీరో” అని నవ్వుతూ ముగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తీరువీర్, కావ్య కల్యాణ్ రామ్, బాంధవీ శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి, సినిమాటోగ్రాఫర్ నగేశ్, నటుడు కృష్ణతేజ, మసూద పాత్ర పోషించిన అఖిల రామ్ తదితరులు పాల్గొన్నారు.