యువ హీరో విశ్వక సేన్ పారితోషికం పెంచాడా? అంటే అవుననే వినిపిస్తోంది. విశ్వక్ నటించిన తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఓ మాదిరిగా నడిచింది. అదీ విడుదలకు ముందు వివాదం పుణ్యమా అని. థియేట్రికల్ రన్ పరంగా ఆకట్టుకోలేక పోయినా డిజిటల్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుకుని నిర్మాతలు బయటపడ్డారు. ఇప్పుడు విశ్వక్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఆ తర్వాత సొంత దర్శకత్వంలో ‘ధమ్కీ’ సినిమా చేయబోతున్నాడు. ఇది పాన్ ఇండియా స్థాయి చిత్రమని ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ విడుదలకు చెప్పాడు. ఆ సినిమాకు సరైన స్పందన రాలేదు కాబట్టి ఇప్పుడు ఒక్క తెలుగుకే పరిమితం అవుతాడా? లేక చెప్పిన విధంగా పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తాడా అన్నది తేలలేదు.
ఇదిలా ఉంటే ‘స్టూడెంట్’ అనే టైటిల్ తో కూడా విశ్వక్ సినిమా చేయబోతున్నాడు. ఇది సొంత బ్యానర్ లోనా లేక బయటి నిర్మాతలా అన్నది తెలియాల్సి ఉంది. ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ సినిమాకు రెండు కోట్లకు లోపు పారితోషికం తీసుకున్న విశ్వక్ ఇప్పుడు కొత్త సినిమా అని వెళ్ళిన వారికి 3 కోట్లు అని డిమాండ్ చేస్తున్నాడట. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె హీరోయిన్ గా విశ్వక్ తో సినిమా చేయాలని భావించి డేట్స్ అడిగినపుడు మూడు కోట్లు కోట్ చేసినట్లు సమాచారం. ఇటీవల కొత్త కారు కొని హడావుడి చేస్తున్న విశ్వక్ పారితోషికం పెంపుతో సొంత సినిమాలకే పరిమితం అవ్వవలసి వస్తుందా? లేక ప్రస్తుతం ఉన్న క్రేజ్ తో నల్లేరుబండి మీద నడకలా సాగిపోతుందా? అన్నది చూడాలి.
