Site icon NTV Telugu

Vijay Devarakonda: ‘లైగర్’ బజ్ కోసమే ‘జేజీఎం’ మొదలెట్టారా!?

JGM

JGM

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా మూవీస్ ‘పుష్ప, రాధేశ్యామ్‌, ఆర్.ఆర్.ఆర్.’ విడుదల అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర వాటి జయాపజయాల మాట ఎలా ఉన్నా, విడుదలకు ముందు సూపర్ బజ్ క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. ఇక కన్నడ నుండి త్వరలో రాబోతున్న ‘కేజీఎఫ్ -2’ చిత్రానికీ దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు లభిస్తున్న ఆదరణ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమౌతుంది. పై చిత్రాలతో పోల్చుకున్నప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘లైగర్’ చిత్రానికి ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదన్నది వాస్తవం. విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండేను హీరోయిన్ గా పెట్టినా, ఓ ప్రత్యేక పాత్రకు బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ ను తీసుకున్నా ఈ మూవీకి భారీ స్థాయి బజ్ క్రియేట్ కాలేదు.

ఇదిలా ఉంటే పూరి జగన్నాధ్‌ బృందం విజయ్ దేవరకొండతోనే మంగళవారం మరో పాన్ ఇండియా మూవీ ‘జేజీఎం’ని ప్రారంభించింది. దీనిని ముంబైలో భారీ స్థాయిలో మొదలు పెట్టడం, అక్కడే మీడియా సమావేశం నిర్వహించడం, మరో యేడాది పాటు తాను ఇదే ప్రాజెక్ట్ మీద ఉంటానని విజయ్ దేవరకొండ హామీ ఇవ్వడం వంటివి చూస్తుంటే ఈ ఆగస్ట్ లో విడుదలయ్యే ‘లైగర్’పై హైప్ ని క్రియేట్ చేయటం కోసమే ‘జేజిఎం’ను తెరపైకి తీసుకొచ్చారని వినిపిస్తోంది. గతంలో ఏదైనా సినిమాకు క్రేజ్ రాకపోయినా, ఊహించినంత బిజినెస్ జరగకపోయినా, అదే కాంబినేషన్ లో మరో సినిమా తీయబోతున్నామనే ప్రకటనలు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఏకంగా పూరి, విజయ్ దేవరకొండ కలయికలో ‘లైగర్’ విడుదల కాకుండానే పూరి ఎప్పటినుంచో ప్రకటిస్తూ వస్తున్న ‘జనగణమన’ సినిమాను ఏకంగా మొదలు పెట్టేశారు. మరి ‘లైగర్’లో ఏమైనా నష్టాలు వస్తే వాటిని ‘జేజీఎం’ ద్వారా తీరుస్తామనే హామీని దర్శకనిర్మాతలు ఇస్తారేమో చూడాలి.

Exit mobile version