Site icon NTV Telugu

Heroines:బాలీవుడ్ టాప్ భామలందరికీ పెళ్ళైపోయిందా!?

Boly Wood Y

Boly Wood Y

అందాల భామలకు పెళ్ళయితే క్రేజ్ తగ్గుతుంది అని ఓ అపోహ! పాత రోజుల్లోనూ ఎంతోమంది గ్లామర్ క్వీన్స్ పెళ్ళయిన తరువాత కూడా అందచందాలతో సందడి చేసిన సందర్భాలు బోలెడున్నాయి. అయితే అభిమానులు ఆరాధించే అందగత్తెలందరూ ఓ ఇంటివారయిపోతే ఫ్యాన్స్ పరిస్థితి ఏమి కావాలి? అలియా భట్ పెళ్ళయిన తరువాత ఇప్పుడు బాలీవుడ్ లో అదే చర్చ సాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ అనదగ్గ ఆరుమందిలో అలియా భట్ అందరికన్నా చిన్నది. ఆమె కూడా రణబీర్ తో మూడుముళ్ళబంధం వేసుకుంది. అందువల్ల అభిమానులు కాసింత దిగులు పడుతున్న మాట వాస్తవమే అని బాలీవుడ్ బాబులు చెబుతున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో పది కోట్లకు పైగా పారితోషికం పుచ్చుకొనే భామలు ఆరుమంది ఉన్నారు. వారెవరంటే అలియా భట్, దీపికా పదుకొణే, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా. వీరు ఆరుగురు అటూ ఇటుగా సినిమాకు పది కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు టాక్. ఇంత క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మలు పెళ్ళి చేసుకున్నతరువాత రెమ్యూనరేషన్ ఏమైనా తగ్గిస్తారేమో అని ఎదురుచూసిన నిర్మాతలకు నిరాశే కలిగింది. ఎందుకంటే ఈ భామలకు పెళ్ళయిన తరువాత కూడా జనాల్లో క్రేజ్ పెరిగిందట! ఒకప్పుడు కరీనా కపూర్ సినిమాకు కోటి రూపాయలే పుచ్చుకొనేదట. పెళ్ళయ్యాక ఆమెకు మరింత డిమాండ్ పెరిగి, ఈ నాటికి పడచుభామల స్థాయిలో పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం.

ఇలా అత్యధిక పారితోషికం అందుకొనే భామలు గతంలోనూ ఉన్నారు. అయితే వారు ఒకరి తరువాత ఒకరు వరుసగా పెళ్ళి చేసుకోలేదు. ఓ ముద్దుగుమ్మ మూడుముళ్ళు వేయించుకోగానే, మరో అందాలభామ కొన్నేళ్ళు గ్యాప్ తీసుకొనేది. దాంతో మరో కొత్త భామ వచ్చే దాకా టాప్ లో ఉన్న హీరోయిన్స్ అందచందాలతో అభిమానులను అలరించేవారు. కానీ, పెళ్ళయి ఓ బిడ్డ తల్లులు అయిన తరువాత కూడా కరీనా, ప్రియాంకలకు క్రేజ్ తగ్గడం లేదు. వీరిద్దరితో పాటు టాప్ లో ఉన్న అలియా, కత్రినా, దీపిక, అనుష్క కూడా పెళ్ళాడేశారు. ఇలా టాప్ స్టార్స్ గా రాజ్యమేలుతున్న ఆరుమంది హీరోయిన్స్ పెళ్ళి చేసుకోవడం బాలీవుడ్ లో ఇదే మొదటి సారి అన్నది పరిశీలకుల మాట. మరి ఫ్యాన్స్ తమ బాధ ఎవరికి చెప్పుకుంటారు?

Exit mobile version