Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్

Dhruv Vikram Mythri Movies

Dhruv Vikram Mythri Movies

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ జోరు ఈ మధ్యకాలంలో ఇతర భాషల్లోనూ గట్టిగా కనిపిస్తోంది. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా.. కంటెంట్ ఉన్న కథలతో పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ (తమిళం) మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించిన మైత్రీ మేకర్స్, తాజాగా అక్కడ తమ నాలుగవ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసింది. కోలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న చియాన్ విక్రమ్ వారసుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్ సరసన ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ధృవ్ కెరీర్‌లో ఇది 4వ చిత్రం (#DV4) కావడం విశేషం. పూర్తి స్థాయి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు.

చెన్నైలోని MRC నగర్‌లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ షాట్‌కు దర్శకుడు కీర్తిశ్వరన్ క్లాప్‌బోర్డ్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తమిళ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ దర్శకులు అధిక్ రవిచంద్రన్, రవికుమార్, ఆంటోనీ భాగ్యరాజ్, రాజా, శశితో పాటు టాలీవుడ్ నుంచి ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ ఈ ఈవెంట్‌కు హాజరై సందడి చేశారు. హీరో ధృవ్ విక్రమ్, డైరెక్టర్ కరణ్ సహా చిత్ర యూనిట్ మొత్తం ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఇప్పటివరకు నటనకు ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన పాత్రలతో మెప్పించిన ధృవ్ విక్రమ్, ఈ సినిమాతో మొదటిసారి ఒక ఊర మాస్ ఓరియెంటెడ్ అవతార్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మాస్ ప్రేక్షకులను, కమర్షియల్ లవర్స్‌ను ఆకట్టుకునేలా దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్ ఈ కథను సిద్ధం చేశారు. కరణ్ అండ్ సబీ సంయుక్తంగా ఈ చిత్రానికి పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లేను అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.