Devulapalli Krishna Shastri: తెలుగు చిత్రసీమలో పాటల పందిరి అంటే ప్రఖ్యాత దర్శకులు బి.యన్.రెడ్డి రూపొందించిన ‘మల్లీశ్వరి’నే ముందుగా చెప్పుకోవాలి. అందులో ప్రతీ పాట సందర్భోచితంగా అమృతం చిలికింది. అందుకు బి.యన్. కళాతృష్ణ ఓ కారణమయితే, ఆయన మదిని చదివి మరీ సాహిత్యం చిలికించిన ఘనత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిదే! దేవులపల్లి వారి వాణికి అనువుగా సాలూరు రాజేశ్వరరావు బాణీలు సాగాయి. అందుకే ‘మల్లీశ్వరి’ ఓ పాటల పందిరిగా ఈ నాటికీ సాహితీ సువాసనలు వెదజల్లుతూనే ఉంది.
‘మల్లీశ్వరి’లోనే “ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు…” అంటూ జనానికి హాయిని కలిగించారు కృష్ణశాస్త్రి. ఆ తరువాత నుంచీ కృష్ణశాస్త్రి పాటలు హాయిని కలిగిస్తూనే సాగాయి. నాగయ్య ‘నా ఇల్లు’లోని “అదిగదిగో గగనసీమ…”, ‘బంగారు పాప’లోని “యవ్వన మధువనిలో…”, ‘భాగ్యరేఖ’లోని “నీవుండేదా కొండపై… నా స్వామి…”, ‘రాజమకుటం’లోని “సడిసేయకో గాలి…”, ‘సుఖదుఃఖాలు’లోని “ఇది మల్లెల వేళయనీ…”, ‘ఉండమ్మా బొట్టు పెడతా’లోని “రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా…”, ‘ఏకవీర’లోని “ప్రతీరాత్రి వసంతరాత్రి…”, ‘మాయని మమత’లోని “రానిక నీ కోసం సఖీ…”, ‘భక్త తుకారాం’లోని “ఘనాఘన సుందరా…కరుణారస మందిరా…”, ‘సీతామాలక్ష్మి’లోని “మావిచిగురు తినగానే…”, ‘గోరింటాకు’లోని “గోరింటా పూచిందీ కొమ్మా లేకుండా…”, ‘కార్తీకదీపం’లోని “ఆరనీకుమా ఈ దీపం… కార్తీక దీపం…”, ‘అమెరికా అమ్మాయి’లోని “పాడనా తెలుగు పాట…”, ‘మేఘసందేశం’లోని “ఆకులో ఆకునై…” పాటలు కృష్ణశాస్త్రి కలం నుండి జాలువారినవే. ఈ నాటికీ దేవులపల్లి భావకవిత్వం, సినిమా సాహిత్యం సైతం సాహితీప్రియులను ఆనందడోలికల్లో ఊగిస్తూనే ఉండడం విశేషం!
దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి 1897 నవంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని రావువారి చంద్రపాలెంలో జన్మించారు. ఆయన తండ్రి, పెదనాన్న ఇద్దరూ ఆ రోజుల్లో మహాపండితులు. వారింట్లో నిత్యం ఏదో ఒక సాహితీగోష్ఠి సాగుతూ ఉండేది. మాతృభాష తెలుగులో అపారపాండిత్యం సంపాదించారు కృష్ణశాస్త్రి. ఆంగ్లంలోనూ మంచి పట్టు సాధించారు. విజయనగరంలో డిగ్రీ పూర్తి చేసి, కాకినాడ మిషన్ హైస్కూల్ లో ఉపాధ్యాయునిగా పనిచేశారు కృష్ణశాస్త్రి. బ్రహ్మసమాజ ప్రభావం ఆయనపై చాలా ఉండేది. మొదటి భార్య మరణించిన తరువాత బ్రహ్మసమాజంలో చురుకుగా సాగారు. ఆ సమయంలోనే వైద్యం కోసం బళ్ళారి వెళ్తూ ‘కృష్ణపక్షం కావ్యం’ రచించారు. తెలుగునేలను ఆ కావ్యం ఎంతగానో పులకింపచేసింది. కృష్ణశాస్త్రికి అభిమాన సంఘాలు వెలిశాయి. ఆయనలాగా గిరిజాల జుట్టు పెంచి ఎంతోమంది కవులు బయలుదేరి భావకవిత్వాన్ని పలికించారు. 1929లో విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ తో కృష్ణ శాస్త్రికి పరిచయం ఏర్పడింది. వారిద్దరూ తరచూ లేఖల ద్వారా సాహితీచర్చలు సాగించేవారు. కృష్ణశాస్త్రి పాటపై మనసు పడ్డ దర్శకులు బి.యన్.రెడ్డి తన ‘మల్లీశ్వరి’ సినిమాలో అన్ని పాటలూ రాయడానికి ఆయనను పిలిపించుకున్నారు.
ఆకాశవాణిలోనూ కృష్ణశాస్త్రి రాసిన ఎన్నో గేయాలు, నాటికలు వెలుగు చూశాయి. కృష్ణశాస్త్రి భావకవిత్వం రాజ్యమేలుతున్న రోజుల్లోనే శ్రీశ్రీ తన విప్లవకవిత్వాన్నీ వినిపించారు. సాహితీప్రియులు ఇద్దరి రచనలనూ ఎంతగానో ప్రేమించారు. చిత్రసీమలోనూ ఇద్దరి పాటలు జనాన్ని మురిపించాయి. ‘మల్లీశ్వరి’తో మధురం పంచడం ఆరంభించిన కృష్ణశాస్త్రి కడదాకా తెలుగువారిని పులకింపచేస్తూనే సాగారు. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి కన్నుమూశారు. ఆయన పాటలు మాత్రం నేటికీ మధురామృతం కురిపిస్తూనే ఉన్నాయి.
(నవంబర్ 1న దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి)