NTV Telugu Site icon

ప‌డుకోనివ్వ‌ని దీపికా ప‌డుకోణె అందం – అభిన‌యం!

deepika

deepika

మెరుపు తీగెలాంటి మేనిసోయ‌గంతో చూప‌రుల‌ను ఇట్టే ఆక‌ర్షించే రూపం అందాల దీపికా ప‌డుకోణె సొంతం. ద‌క్షిణాదికి చెందిన‌ ఈ తార ఉత్త‌రాదిని ఉడికించింది. ప్ర‌ఖ్యాత బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ ప్ర‌కాశ్ ప‌డుకోణె పెద్ద‌కూతురు దీపిక‌. ఒక‌ప్పుడు ప్ర‌కాశ్ కూతురుగా ఉన్న గుర్తింపును ఇప్పుడు దీపిక తండ్రి ప్ర‌కాశ్ ప‌డుకోణె అనే స్థాయికి తీసుకు వెళ్ళింది ఆమె అభిన‌య ప‌ర్వం. న‌వ‌త‌రం నాయిక‌ల్లో దీపికా ప‌డుకోణె త‌న‌దైన బాణీ పలికిస్తూ బొంబాయి సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఏలుతున్నారు.

దీపికా ప‌డుకోణె మ‌న దేశం మెచ్చిన అందాల‌తార‌. అయితే ఈమె పుట్టింది మాత్రం విదేశాల్లో. 1986 జ‌న‌వ‌రి 5న డెన్మార్క్ లో జ‌న్మించారామె. సార‌స్వ‌త్ బ్రాహ్మ‌ణ కుటుంబంలో జ‌న్మించిన దీపికా ప‌డుకోణె ఇంట్లో కొంక‌ణి మాట్లాడ‌తారు. బెంగ‌ళూరులోని సోఫియా హైస్కూల్ లో ప‌దోత‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్న దీపిక‌, అక్క‌డి మౌంట్ కార్మెల్ కాలేజ్ లో పి.యు.సి. పూర్తి చేసింది. అప్ప‌టి నుంచీ ఆమెకు షో బిజ్పై ఆస‌క్తి ఉండేది. దాంతో మోడ‌లింగ్ ను ఎంచుకుంది. అందువ‌ల్ల ఓపెన్ యూనివ‌ర్సిటీలో డిగ్రీ చేస్తున్నా దానిని పూర్తిచేయ‌లేక పోయింది. చ‌దువుకొనే రోజుల్లో తండ్రిలాగే బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ కావాల‌ని ఆశించింది. ప‌దో త‌ర‌గ‌తి త‌రువాత ఫ్యాష‌న్ మోడ‌ల్ కావాల‌నే అభిలాష హెచ్చింది. దాంతో మోడ‌లింగ్ లో అడుగు పెట్టింది. చూప‌రుల‌ను ఇట్టే ఆక‌ట్టుకొనే రూపం ఉన్న కార‌ణంగా,ఆమె అందులో రాణిస్తుంద‌ని త‌ల్లి ఉజ్జ్వ‌ల భావించారు, దీపిక‌ను ప్రోత్స‌హించారు. దీపిక చెల్లెలు అనిష మాత్రం తండ్రి బాట‌లో ప‌య‌నిస్తూ క్రీడాకారిణిగా గోల్ఫ‌ర్ అయింది. దీపిక మోడ‌ల్ గా ఉన్న రోజుల్లోనే క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర త‌న ఐశ్వ‌ర్య‌ చిత్రంతోఆమెను హీరోయిన్ గా ప‌రిచ‌యం చేశారు. ఈ సినిమాకు తెలుగు సూప‌ర్ హిట్ మూవీ మ‌న్మ‌థుడు ఆధారం. అదే స‌మ‌యంలో తెలుగు ద‌ర్శ‌కుడు జ‌యంత్ సి.ఫ‌రాన్జీ తాను రూపొంందించిన ఓ తెలుగు సినిమాలో దీపిక‌తో ఓ పాట చిత్రీక‌రించారు. అది వెలుగు చూడ‌లేదు. దీపిక‌ను అదృష్టం వెంటాడింది. బాలీవుడ్ తొలి చిత్రం ఓం శాంతి ఓంలో ఏకంగా అప్ప‌టి సూప‌ర్ స్టార్ షారుఖ్ ఖాన్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం సాధించిన ఘ‌న‌విజ‌యం, అందులో దీపిక అభిన‌యం ఆమెను ఓ సూప‌ర్ హీరోయిన్ గా మార్చేశాయి.

బాలీవుడ్ లో దీపిక అందం మెరిసే కొద్దీ, ఆమె స్టార్ డ‌మ్ కూడా పెరుగుతూ పోయింది. అదే స‌మ‌యంలో రాజ్ క‌పూర్ మ‌న‌వ‌డు, రిషీ క‌పూర్ త‌న‌యుడు ర‌ణ‌బీర్ క‌పూర్ తో దీపిక ప్రేమాయ‌ణం సాగించింది. దాంతో దీపిక ప్రేమ‌క‌థ ఉత్త‌రాదినే కాదు, ద‌క్షిణాదినీ ఆక‌ర్షించింది. అలా కొన్నాళ్ళు ప్రేమాయ‌ణం త‌రువాత ర‌ణ‌బీర్ ఈమెకు బ్రేక‌ప్ చెప్పి మ‌రో ల‌వ్ స్టోరీ మొద‌లెట్టాడు. ఆ స‌మ‌యంలో దీపిక‌ను నిజంగా ప్రేమించిన ర‌ణ‌వీర్ సింగ్ ఆమె జీవితంలో ప్ర‌వేశించాడు. వారిద్ద‌రి ప్రేమ ఫ‌లించింది. పెద్ద‌ల అంగీకారంతోనే పెళ్ళి కూడా చేసుకున్నారు.

దీపిక అందంతో బంధాలు వేస్తూ ప‌లు చిత్రాలను విజ‌య‌ప‌థంలో న‌డిపించింది. ఈ మాటంటే అతిశ‌యోక్తి అనిపించ‌వ‌చ్చు, ఆమెను బాలీవుడ్ కు ప‌రిచ‌యం చేసిన షారుఖ్ ఖాన్ ఆమెకు ఆ కితాబు నిచ్చారు. షారుఖ్ చివ‌రి హిట్ గా నిల‌చిన చెన్నై ఎక్స్ ప్రెస్లో దీపిక‌నే క‌థానాయిక కావ‌డం విశేషం. దీపిక న‌టించిన బ‌చ్ నా యే హ‌సీనో, చాంద్నీ చౌక్ టు చైనా, ల‌వ్ ఆజ్ క‌ల్, కాక్ టెయిల్, గ‌లియోంకీ రాస్ లీల - రామ్ లీల‌, బాజీరావ్ మ‌స్తానీ, ప‌ద్మావ‌త్ చిత్రాలు జ‌నాన్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. దీపిక నిర్మాత‌గా మారి న‌టించి, నిర్మించిన ఛ‌ప‌క్ సైతం మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ మ‌ధ్యే జ‌నం ముందు నిలచిన 83 సినిమాలో ఆమె భ‌ర్త ర‌ణ్ వీర్ సింగ్ హీరోగా న‌టించారు. ఆ సినిమాను కూడా దీపిక‌నే నిర్మించారు. గెహ్రాయియా, స‌ర్క‌స్, ప‌ఠాన్, ప్రాజెక్ట్ కె చిత్రాల‌లో దీపిక న‌టిస్తున్నారు. ఆమె మ‌రిన్ని పుట్టిన‌రోజులు జ‌రుపుకుంటూ ఆనందంగా సాగాల‌ని ఆశిద్దాం.