Dasari Narayana Rao: నటరత్న యన్టీఆర్, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో రూపొందిన చిత్రాలు ఐదంటే ఐదే! యన్టీఆర్ తో దాసరి తొలి చిత్రం ‘మనుషులంతా ఒక్కటే’. 1976లో విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లో సెన్సేషనల్ హిట్. స్వాతంత్య్రానికి ముందు ఫ్యూడల్ వ్యవస్థ తీరు తెన్నుల నేపథ్యంలో కథను ఆరంభించి, నాడు అహంకరించిన రాచరికం కోరలు పెరికి, ‘దున్నేవాడిదే భూమి’ అన్న సత్యాన్ని చాటుతూ సినిమాను ముగించారు దాసరి. ఆ తరువాత ఎందుకనో దాసరి చిన్న సినిమాలతోనే బిజీగా ఉంటూ, యన్టీఆర్ లాంటి అగ్ర నటునితో సినిమా తీయడానికి దాదాపు నాలుగేళ్ళ సమయం తీసుకున్నారు. ఆ తరువాత రామారావుతో 1980లో ‘సర్కస్ రాముడు’, ‘సర్దార్ పాపారాయుడు’, 1981లో ‘విశ్వరూపం’, 1982లో ‘బొబ్బిలిపులి’ తెరకెక్కించారు దాసరి. వీటిలో ఒక్క ‘విశ్వరూపం’ మినహాయిస్తే అన్నీ జనాదరణ పొందినవే. వాటిలో ‘మనుషులంతా ఒక్కటే, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి’ సిల్వర్ జూబ్లీస్ చూశాయి. ‘బొబ్బిలిపులి’ స్వర్ణోత్సవం చూసింది. తాను అక్కినేని అభిమానిని అని గర్వంగా చెప్పుకున్న దాసరి, యన్టీఆర్ తోనే జనం మెచ్చే చిత్రాలను ఘనంగా అందించారు. యన్టీఆర్ తోనే దాసరి సక్సెస్ రేట్ అధికంగా ఉంది.
యన్టీఆర్ అంటే పౌరాణికాలకు పెట్టింది పేరు. ఆయనతో ఓ మహత్తర పౌరాణికం రూపొందించాలన్నది దాసరి అభిలాష! మరి ఆయన మదిలో ఏ పౌరాణిక పాత్రలో యన్టీఆర్ ను నటింప చేయాలని భావించారు? వినడానికి చిత్రంగా ఉంటుంది. జరాసంధుని పాత్రలో యన్టీఆర్ ను చూడాలన్నది దాసరి ఆలోచన! ఎందుకంటే మహాభారతంలో భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, బకాసురుడు ఒకే ముహూర్తంలో జన్మించిన సింహబలులు అని పేరు. ఈ ఐదు పాత్రల్లో అప్పటికే భీమ,సుయోధన,కీచక పాత్రలను రామారావు ధరించి అలరించారు. అందువల్ల జరాసంధ పాత్రలో రామారావును నటింప చేయాలన్నది దాసరి అభిలాష! జరాసంధుడు, కృష్ణుని మధ్య వైరం అన్నది అందరికీ తెలిసిందే. కృష్ణునికి మేనమామ కంసుడు. అతనికి అమ్మాయిలను ఇచ్చి పెళ్ళిచేసిన మామ జరాసంధుడు. కృష్ణుడు కంసుని చంపిన తరువాత అతనిపై జరాసంధుడు పగబట్టడం, అతని వృత్తాంతం అన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. అందువల్ల ఆ పాత్రలో రామారావును నటింపచేయాలని ఆశించారు దాసరి. కానీ, అప్పటికే రామారావు పౌరాణికాలకు అది సరైన సీజన్ కాదని కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ లోగా దాసరి ‘సర్దార్ పాపారాయుడు’ కథ రెడీ చేయడం, ఆ సినిమా షూటింగ్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్నప్పుడే యన్టీఆర్ లో రాజకీయాల్లో ప్రవేశించాలన్న భావన కలగడం వంటివి జరిగాయి. ఆ తరువాత యన్టీఆర్ తో ‘విశ్వరూపం, బొబ్బిలిపులి’ మాత్రమే తెరకెక్కించగలిగారు దాసరి. ఆ పై రామారావు రాజకీయాల్లో అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా, తరువాత ప్రతిపక్ష నాయకునిగా, మళ్ళీ ముఖ్యమంత్రిగా సాగడంతో వీలు కాలేదు. అందువల్ల దాసరి అభిలాష అలాగే ఉండిపోయింది. యన్టీఆర్ తో పౌరాణికం ఇలా ఉంటే, శోభన్ బాబుతో ‘కృష్ణ-కుచేల’ అన్న పౌరాణికం రూపొందించాలనీ దాసరి ఆశించారు. అదీ ఫలించలేదు. ఆ తరువాత పౌరాణిక పాత్రలకు జీవం పోసే నటీనటులు లేకపోవడం వల్లే తాను పౌరాణికం రూపొందించలేదని చెప్పేవారు దాసరి. కేవీ రెడ్డి ‘మాయాబజార్’ స్ఫూర్తితో సోషియో ఫాంటసీగా అదే టైటిల్ తో దాసరి ఓ సినిమా రూపొందించారు. ఆ తరువాత ఏ ప్రయత్నమూ చేయలేదు.