Dasari Kiran Kumar: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు కొత్త సభ్యుడిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. 24 మంది సభ్యుల బోర్డు సభ్యుల్లో ఒకరిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ను సీఎం జగన్ నియమించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ టీటీడీ పాలక మండలి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే.. ఇప్పటి వరకు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 19 మందిగా ఉన్న బోర్డు సభ్యుల సంఖ్యను 24కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా 24 మంది సభ్యుల బోర్డు సభ్యుల్లో ఒకరిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ అవకాశం లభించడంపై దాసరి కిరణ్ సంతోషం వ్యక్తం చేశారు.
“నేను జగన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానిని. ఈ నియామకంతో విధేయుడికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపించుకున్నారు” అంటూ దాసరి కిరణ్ కుమార్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కి దాసరి కిరణ్ సన్నిహితుడు కావున ఎంపీ బాలశౌరికి, ఎంపీ వై వి సుబ్బారెడ్డికి సైతం ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక నిర్మాతగా దాసరి కిరణ్.. జీనియస్, రామలీల, వంగవీటి, సిద్దార్థ లాంటి సినిమాలను నిర్మించారు. ఈ విషయం తెలియడంతో పలువురు ప్రముఖులు దాసరి కిరణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.