NTV Telugu Site icon

ప్రతిభకు కొలమానం… ఫాల్కే అవార్డు…

Dadasaheb-Phalke-Award

Dadasaheb-Phalke-Award

భారతీయ చిత్రసీమలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. భారతీయ సినిమా రంగానికి ఎనలేని సేవలు చేసినవారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు ప్రకటించిన ప్రతీసారి విమర్శలు కూడా అదే తీరున వినిపిస్తూ ఉంటాయి. 2019 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అందించారు. అక్టోబర్ 25న జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రజనీకాంత్ ఈ అవార్డును అందుకున్నారు. రజనీకాంత్ దక్షిణభారతంలోనే కాదు, యావద్భారతంలోనూ ప్రముఖ నటులు కావడంతో, ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించినప్పుడే అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. తమిళనాడులోనే వందలాది చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హుడే అయినా, ఆయన కంటే ముందు రజనీకాంత్ కు ఫాల్కే అవార్డును ప్రకటించిన నాడే చర్చకు తెర తీసింది. ఆ మాటకొస్తే, రజనీకాంత్ కంటే ముందే కమల్ హాసన్ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. రజనీకాంత్ కు నేరుగా పద్మభూషణ్ అందించారు. అప్పటి నుంచే అభిమానుల నడుమ జాతీయ అవార్డుల విషయంలో చర్చ సాగుతూనే ఉంది. ఆ తరువాత కొన్నేళ్ళకు కమల్ కు కూడా పద్మభూషణ్ ఇచ్చారు. ఏది ఏమైనా జాతీయ సినిమా అవార్డులు ప్రకటించిన ప్రతీసారి విమర్శలు మాత్రం తలెత్తుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు మనవారెవరు దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్నారు అన్న అంశాన్ని ఓ సారి పరిశీలిద్దాం.

దక్షిణాదిన తెలుగువారితోనే…
అంతకు ముందు భారతదేశంలో కొన్ని చిత్రాలు రూపొందినా, వాటిని బ్రిటీష్, ఫ్రెంచి కంపెనీల వారే వచ్చి నిర్మించారు. అలా కాకుండా, సినిమా టెక్నాలజీని అధ్యయనం చేసి, సినిమాలను నిర్మించిన తొలి భారతీయునిగా దాదాసాహెబ్ ఫాల్కే నిలిచారు. ఆయన తెరకెక్కించిన ‘రాజా హరిశ్చంద్ర’ భారతీయుల తొలి చిత్రంగా నిలచింది. అందువల్ల ఫాల్కేను ‘భారతీయ సినిమా పితామహుడు’ అంటారు. ఆయన పేరున ఓ అవార్డును ప్రవేశ పెడితే బాగుంటుందని 1968లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భావించారు. ఆమె ప్రధాని కాకముందు కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆమెకు సినిమారంగంతోనూ అనుబంధం ఏర్పడింది. అదీగాక, తాను చదువుకున్న శాంతినికేతన్ నులో సహ విద్యార్థుల్లో ఒకరైన సత్యజిత్ రే వంటివారు భారతీయ సినిమా రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించి పెట్టడంతో ఆమెకు కూడా సినిమాల పట్ల ఓ సదవగాహన ఉండేది. ఈ నేపథ్యంలోనే ఫాల్కే అవార్డుకు రూపకల్పన జరిగిందని అంటారు. 1969లో తొలిసారి ఈ అవార్డు ప్రదానోత్సవం సాగింది. మొట్టమొదట ఈ అవార్డును అందుకున్నది ఓ నాటి మేటి నటి దేవికారాణి. తెలుగునేలపైనే విశాఖపట్నంలో జన్మించారామె. ఆమె మాతృభాష బెంగాలీ. అలా దక్షిణ, ఉత్తరానికి వారధిగా నిలచిన దేవికారాణిని ఈ అవార్డుకు తొలుత ఎంపిక చేశారు. ఆమె తరువాత వరుసగా నాలుగేళ్లు ఉత్తరాదికి చెందిన బీరేంద్ర నాథ్ సర్కార్, పృథ్వీరాజ్ కపూర్, పంకజ్ మల్లిక్, రూబీ మేయర్స్ కు ఈ అవార్డును ప్రదానం చేశారు. అప్పట్లో ఉత్తరాదివారికే ఫాల్కే అవార్డు అన్న విమర్శలూ వినిపించాయి. ఆ తరువాతి సంవత్సరం దక్షిణాదికి చెందిన దిగ్దర్శకులు, తెలుగువారయిన బి.యన్.రెడ్డికి 1974లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు. అలా సౌత్ లో ఫాల్కే అవార్డు అందుకున్న మొట్టమొదటి సినిమా వ్యక్తిగా బి.యన్.రెడ్డి నిలిచారు.

అందులోనూ తెలుగువారే…
బి.యన్. రెడ్డి తరువాత మళ్ళీ వరుసగా ఐదేళ్ళు ఉత్తరాదివారికే, అందునా బెంగాలీలకు ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు. 1980లో తెలుగు, హిందీ భాషల్లో నటించిన తెలుగువారయిన పైడి జయరాజ్ కు ఫాల్కే అవార్డు దక్కింది. దక్షిణాదిన రెండో ఫాల్కే అవార్డు అందుకున్న ఘనత జయరాజ్ దే. మళ్ళీ 1982లో తెలుగువారయిన ఎల్.వి.ప్రసాద్ కు ఈ అవార్డు లభించింది. 1986లో తెలుగువారయిన ప్రఖ్యాత నిర్మాత బి.నాగిరెడ్డికి కూడా ఫాల్కే అవార్డు దక్కింది. చిత్రసీమలో ఓ తల్లి కన్న బిడ్డలు ఫాల్కేను అందుకోవడం అన్నది తొలుత బి.యన్.రెడ్డి, బి.నాగిరెడ్డి విషయంలోనే జరిగింది. ఆ తరువాత అదే రీతిన లతా మంగేష్కర్, ఆమె చెల్లెలు ఆశా భోస్లే, రాజ్ కపూర్ ఆయన తమ్ముడు శశికపూర్, బి.ఆర్.చోప్రా ఆయన సోదరుడు యశ్ చోప్రా ఈ అవార్డును అందుకున్న ఒకే తల్లి పిల్లల జాబితాలో ఉన్నారు. బి.నాగిరెడ్డి ఫాల్కే అందుకున్న నాలుగేళ్ళకు 1990లో మళ్ళీ మన తెలుగువారయిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఈ పురస్కారం లభించింది.

తమిళ భాషాభిమానం!
దక్షిణాదిన తెలుగువారే ఆరంభంలో ఫాల్కే అవార్డును అందుకున్నారు. అయితే బి.యన్. రెడ్డి, నాగిరెడ్డి, ఎల్.వి.ప్రసాద్, ఏయన్నార్ ను తమిళ భాషలోనూ పనిచేసినవారేనని తమిళులు వారిని తమవారిగానే లెక్కలో వేసుకున్నారు. తెలుగువారి తరువాత దక్షిణాదిన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ 1995లో ఈ అవార్డును అందుకున్నారు. దాంతో తమిళచిత్రాలలో స్టార్స్ గా వెలిగిన వారికి ఈ అవార్డు రాలేదే అన్న ఆవేదన తమిళ సోదరుల్లో కలిగింది. మళ్ళీ విమర్శలు వినిపించాయి. అవి దేశ రాజధానిని తాకాయి. 1996లో శివాజీ గణేశన్ కు దాదాసాహెబ్ ఫాల్కే లభించింది. తమిళనాట మొట్టమొదటి సారి ఫాల్కే అవార్డును అందుకున్న ఘనత శివాజీకి దక్కింది. నిజానికి తమిళ సినిమా రంగానికి చెందిన వారు అన్నిటా తామే ముందు అనిపించుకోవడంలో ముందుంటారు. తెలుగువారయిన హెచ్.ఎమ్.రెడ్డి తెలుగు, తమిళ మిశ్రమ భాషాచిత్రంగా ‘కాళిదాస’ను తెరకెక్కిస్తే, దానిని తొలి తమిళ చిత్రంగా ప్రచారం చేసుకున్న ఘనులు తమిళులు. అలాంటివారు తమ ప్రాంతం వారికి ఫాల్కే అవార్డు రాలేదని ఎంచలేదు. అవార్డు దక్కించుకున్నవారు తమిళ సినిమాల్లోనూ పనిచేయడం వల్ల తమ వారిగా ప్రచారం చేసుకున్నారు. అదీ తమిళులు భాషాభిమానం.

మనవాళ్ళే…
మళయాళ చిత్రసీమలో తొలిసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ఘనత దర్శకులు ఆడూర్ గోపాలకృష్ణన్ కు దక్కుతుంది. 2004లో ఆడూర్ ఈ అవార్డును అందుకున్నారు. ఆడూర్ తరువాత 2005లో ఫాల్కేను అందుకున్న శ్యామ్ బెనెగల్ హైదరాబాద్ వాసి. అయితే ఆయన హిందీ చిత్రాలలోనే పనిచేశారు. ఇక 2008లో ఈ అవార్డును అందుకున్న వి.కె. మూర్తి మైసూరులో తెలుగు కుటుంబంలో జన్మించినవారు. ఆయన కూడా హిందీ చిత్రాలకే పనిచేయడం గమనార్హం! 2009లో తెలుగువారయిన స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు, 2010లో తమిళనాడుకు చెందిన ప్రముఖ దర్శకులు కె.బాలచందర్ కీర్తి కిరీటంలోనూ ఫాల్కే చోటు సంపాదించింది. ఆ తరువాత ఆరేళ్ళకు అంటే 2016లో తెలుగువారయిన కె.విశ్వనాథ్ కు ఫాల్కే అవార్డు లభించింది. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు 2019 సంవత్సరానికి గాను ఈ అవార్డు లభించింది. ఇలా లెక్క చూస్తే దక్షిణాదిన ఎక్కువగా ఫాల్కే అవార్డులను అందుకుంది తెలుగువారేనని చెప్పవచ్చు.

సూపర్ స్టార్స్… ఫాల్కే అవార్డ్…
భారతీయ చిత్రసీమలోనూ, లేదా తమ మాతృభాషకు చెందిన సినిమా రంగంలోనూ ఎనలేని సేవలు అందించిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేయడం పరిపాటి. మూకీ టాకీ సినిమాల్లో తమదైన బాణీ పలికించిన నటి దేవికారాణి, నటుడు పృథ్వీరాజ్ కపూర్ స్టార్స్ గా వెలుగొందినవారే. అయితే వారి స్టార్ డమ్ మసక బారిన తరువాతే వారికి ఈ అవార్డు ప్రదానం చేయడం గమనార్హం! తెలుగు, హిందీ భాషల్లో నటించిన పైడి జయరాజ్ కు కూడా అలాగే ఫాల్కే ప్రదానం చేశారు. హిందీ చిత్రసీమలో హీరోగా, దర్శకునిగా తనదైన బాణీ పలికించిన రాజ్ కపూర్ వెంటిలేటర్ పైనే వచ్చి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం గమనార్హం! అప్పుడు ఆయన వయసు 63 సంవత్సరాలు. దాదాపుగా ఈ అవార్డు అందుకున్న వారందరూ అరవై ఏళ్ళు దాటినవారే కావడం గమనించతగ్గ అంశం. అక్కినేని తన 66 ఏళ్ళ వయసులో ఫాల్కే అవార్డు అందుకున్నారు. దిలీప్ కుమార్ 72 ఏళ్ళ వయసులోనూ, కన్నడ రాజ్ కుమార్ 66 ఏళ్ళ వయసులోనూ, శివాజీ గణేశన్ 68 సంవత్సరాలలోనూ, దేవానంద్ 74 ఏళ్ళప్పుడు, శశికపూర్ 75 ఏళ్ళలోనూ, మనోజ్ కుమార్ 76 ఏళ్ళలోనూ, అమితాబ్ బచ్చన్ కు 76 ఏళ్ళ వయసులో ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు. వినోద్ ఖన్నాకు 70 ఏళ్ళ వయసులోనే ఫాల్కే అవార్డు ప్రకటించినా, ఆయన మరణానంతరం ఈ అవార్డు కుటుంబసభ్యులకు అందించారు. ఇలా అరవై ఏళ్ళు, డెబ్బై ఏళ్ళ పైబడ్డ వారికే ఫాల్కే అవార్డును ప్రదానం చేస్తూ వచ్చారు. అప్పటికి వారి స్టార్ డమ్ కూడా మసక బారి కేరెక్టర్ రోల్స్ లోనో, స్పెషల్ అప్పియరెన్స్ కో పరిమితం అయిపోయిన సూపర్ స్టార్సే ఈ అవార్డును అందుకున్నారు.

రజనీకాంత్ ప్రత్యేకత!
అయితే రజనీకాంత్ 70 ఏళ్ళు దాటినా, ఇప్పటికీ తమిళ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు జనం ముందుకు వచ్చి సందడి చేస్తూనే ఉన్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తరువాత కూడా సోలో హీరోగా రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’గా అనువాదమై ప్రేక్షకుల ముందు నిలువనుంది. పైగా రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రాలకు ఇప్పటికీ మార్కెట్ ఉండడం విశేషం! ఈ విషయంలో మాత్రం రజనీకాంత్ ఇప్పటి వరకూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్న వారిందరికంటే భిన్నంగా నిలిచారని చెప్పవచ్చు. ఆ విధంగా స్టార్ డమ్ ఉండగానే ఫాల్కే అవార్డు అందుకున్న తొలి నటునిగా రజనీకాంత్ నిలిచారు. మరి ఈయన బాటలో ఎవరు ఫాల్కేను సొంతం చేసుకుంటారో చూడాలి.