NTV Telugu Site icon

Dabbuku Lokam Dasoham 50 Years: యాభై ఏళ్ళ ‘డబ్బుకు లోకం దాసోహం’!

Dabbuku Lokam Dasoham

Dabbuku Lokam Dasoham

Dabbuku Lokam Dasoham: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావుతో ‘శ్రీవేంకటేశ్వర స్వామి ఫిలిమ్స్’ (యస్.వి.యస్. ఫిలిమ్స్) సంస్థ అధినేత మిద్దే జగన్నాథరావు అనేక మరపురాని చిత్రాలు నిర్మించారు. వాటిలో “నిండుమనసులు, కలిసొచ్చిన అదృష్టం, నిండు హృదయాలు, నిండు దంపతులు” వంటి సినిమాలు ఉన్నాయి. ఆ తరువాత యస్వీయస్ సంస్థ యన్టీఆర్ తో నిర్మించిన చిత్రం ‘డబ్బుకు లోకం దాసోహం’. 1973 జనవరి 12న విడుదలైన ఈ చిత్రం విశేషాదరణ చూరగొంది.

‘డబ్బుకు లోకం దాసోహం’ కథలోకి తొంగిచూస్తే – రాము డిగ్రీ చదివినా, సొంతవూరిలో బాబాయ్, ఆయన కూతురుతో కలసి జీవిస్తూ ఉంటాడు. జీవనం కోసం గుర్రపు బండి నడుపుకుంటూ ఉంటాడు రాము. ఓ రోజు ఆ ఊరి సర్పంచ్ ధర్మారావు మేనకోడలు అరుణను తన జట్కాలో తీసుకువస్తాడు రాము. అలా పరిచయమైన రాము, అరుణ తరువాత ప్రేమించుకుంటారు. ధర్మారావు, ఆయన తమ్ముడు సత్యం ఊరిలో తమ మాటకు ఎవరు ఎదురు చెప్పినా, వారి అంతు చూసేందుకు సిద్ధపడుతూ ఉంటారు. అన్న ధర్మారావు చెప్పడం, ఎలాంటి నీచకార్యమైనా సత్యం చేయడం సాగుతూ ఉంటాయి. సత్యం తప్పతాగి పలు తప్పుడు పనులు చేస్తున్నా, జనం ఏమీ అనలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో చదువుకున్న రాము వారి ఆగడాలను ఎదిరిస్తాడు. తప్పు జరిగినప్పుడు నిలదీస్తాడు. పైగా తన తమ్ముడు సత్యంకు, మేనకోడలు అరుణకు పెళ్ళి చేయాలన్నది ధర్మారావు పన్నాగం. కానీ, రాము, అరుణ ప్రేమించుకుంటున్నారని తెలిసిన ధర్మారావు ఓ పథకం ప్రకారం ఓ హత్యానేరం రాముపై మోపి జైలుకు పంపిస్తాడు.

అక్కడ రామును అన్నగా భావించే బాబు, అతని మిత్రులు కలుస్తారు. బయట లాటరీ టిక్కెట్లు అమ్ముకొనే బాబును కూడా ధర్మారావు జైల్లో తోయించి ఉంటాడు. బాబుకు లాటరీ టిక్కెట్ల పిచ్చి, తనతో పాటు ఉన్న రాము, మరో ఇద్దరి కోసం నాలుగు లాటరీ టిక్కెట్లు కొంటాడు. వాటిలో రాముకు ఇచ్చిన టిక్కెట్ కు లాటరీ తగులుతుంది. ముందుగా విడుదలైన మిత్రుడు ఆ డబ్బుతో లక్షలు సంపాదిస్తాడు. తరువాత బాబు వచ్చి, ఆ డబ్బును మరింత పెంచుతాడు. అంతా తాము ‘అన్న’గా గౌరవించే రాము అదృష్టంగా వారు భావిస్తారు. ‘అన్న’ పేరుతోనే పలు వ్యాపారాలు పెడతారు. రాము జైలు నుండి వచ్చాక అతనికే ఆ డబ్బు అప్పగిస్తారు. దాంతో డాబుగా తన సొంత ఊరికి వెళ్ళి, అక్కడ డబ్బుకోసం జనం ఎలా నీచానికి దిగుతారో నిరూపిస్తాడు రాము. మొదట్లో రామును ప్రేమించిన అరుణ సైతం అపార్థం చేసుకుంటుంది. చివరకు ధర్మారావు, అతని తమ్ముని మధ్యనే పొరపొచ్చాలు వస్తాయి. దాంతో వారి తప్పులు వారే బయట పెట్టుకుంటారు. వాటిని పోలీసులు మారువేషాల్లో వచ్చి రికార్డ్ చేస్తారు. దుష్టులను చట్టం జైలుకు తీసుకువెళ్తుంది. రామును క్షమించమని అరుణ కోరుతుంది. వారిద్దరూ ఒక్కటవ్వడంతో కథ ముగుస్తుంది.

యన్టీఆర్ సరసన జమున నాయికగా నటించిన ఈ చిత్రంలో యస్వీ రంగారావు, సత్యనారాయణ, పద్మనాభం, రేలంగి, రావి కొండలరావు, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, రమాప్రభ, వై.విజయ, లీలారాణి ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి కథకుడు మోదుకూరి జాన్సన్, ఆయన రాసిన సంభాషణలు భలేగా అలరించాయి. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కొసరాజు, సి.నారాయణ రెడ్డి పాటలు రాశారు. “ఏక్ దో తీన్ చార్ పంచపటానా…”, “నువ్వూ నేనూ నడిచేది ఒకే బాటా…”, “చెప్పాలని ఉన్నది నీకొక్కమాట…”, “చూస్తున్నావా ఓ దేవా…”, “తాగుతా నీ యబ్బా…”, “చదువూ సంపద అందరిదీ…”, “డబ్బుకు లోకం దాసోహం తందానానా…” అంటూ సాగే పాటలు భలేగా అలరించాయి. డి.యోగానంద్ దర్శకత్వంలో రూపొందిన ‘డబ్బుకు లోకం దాసోహం’ మంచి విజయం సాధించి, శతదినోత్సవం చూసింది. రిపీట్ రన్స్ లోనూ ఈ చిత్రం మంచి ఆదరణ చూరగొంది.