Tollywood: పెద్ద, చిన్న అనే తేడా సినిమా బడ్జెట్, స్టార్ కాస్టింగ్ బట్టి కాకుండా… అది సాధించే విజయం మీద ఆధారపడి ఉంటుంది. భారీ బడ్జెట్ తో తీసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టొచ్చు. తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమా ఆరేడు రెట్లకు మించిన లాభాలను తేవచ్చు. జూన్ 2న అలాంటి రెండు చిన్న సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అవి ఇద్దరు నిర్మాతల వారసుల చిత్రాలు కావడం విశేషం. అవే ‘అహింస’. ‘నేను స్టూడెంట్ సర్!’. ఈ ఇద్దరు వారసుల తండ్రుల పేర్లు సురేశ్ కావడం కాకతాళీయం.
మూవీ మొఘల్ రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కొడుకు అభిరామ్ ‘అహింస’ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ సినిమాతో గీతిక తివారి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమా జూన్ 2న రిలీజ్ అవుతోంది. అలానే మరో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కొడుకు గణేశ్ నటించిన ‘నేను స్టూడెంట్ సర్!’ కూడా అదే రోజు జనం ముందుకు వస్తోంది. ఈ సినిమాతో అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దాసాని హీరోయిన్ గా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెడుతోంది. విశేషం ఏమంటే… అటు అభిరామ్ అన్నయ్య రానా, ఇటు గణేశ్ అన్నయ్య సాయి శ్రీనివాస్ ఇద్దరూ ఇప్పటికే తెలుగు చిత్రసీమలో హీరోలుగా రాణిస్తున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఈ రెండు సినిమాలకూ ఈ హీరోల తండ్రులు మాత్రం నిర్మాతలు కాదు. ‘అహింస’ సినిమాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద పి. కిరణ్ నిర్మిస్తుంటే, ‘నేను స్టూడెంట్ సర్’ సినిమాను రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యూత్ ఫుల్ యాక్షన్ డ్రామాస్ గా తెరకెక్కిన ఈ రెండు సినిమాలలో ఏది ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటుందో చూడాలి.