Site icon NTV Telugu

‘కొండంత’ అభిమానం : అఫ్రికా కొండపై సోనూ సూద్ అభిమాని!

హీరోలు చాలా మంది ఉంటారు. రియల్ హీరోలు కొందరే. అటువంటి వారిలో సోనూ సూద్ కూడా ఒకరు అంటున్నాడు ఉమా సింగ్. పాతికేళ్ల సైకిలిస్ట్ ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో పర్వత శిఖరాగ్రం చేరుకున్నాడు. మొదట సైకిల్ పై కిలిమంజారో బేస్ పాయింట్ దాకా చేరుకున్న ఉమా అక్కడ్నుంచీ కాలి నడకన పర్వత శిఖరాన్ని చేరుకున్నాడు. ఆపైన ఆకాశమంత ఎత్తున నిలుచుని సోనూ సూద్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. త్రివర్ణ పతాకంతో కూడిన పోస్టర్ లో సోనూ సూద్ ను చూపిస్తూ ‘రియల్ హీరో ఆఫ్ ఇండియా’ అని ప్రకటించాడు!

కరోనా కష్ట కాలంలో సోనూ ఎంతో మందిని వ్యక్తిగతంగా ఆదుకోవటంతో ఆయనకు చాలా మంది అభిమానులు అయ్యారు. వారిలో ఒకరే ఉమా సింగ్. సైకిలిస్ట్, మౌంటినీర్ అయిన ఆయన ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో శిఖరాగ్రం చేరుకుని తన రియల్ హీరోపై అభిమానం ఘనంగా చాటుకున్నాడు. దీనిపై స్పందించిన సోనూ సూద్, ఇండియన్ యూత్ ఏదైనా తలుచుకుంటే తప్పకుండా సాధించగలరని, ఉమా నిరూపించాడంటూ… మెచ్చుకున్నాడు. “నా జీవితంలో మొదటిసారి సోనూ లాంటి రియల్ హీరోని చూశా”నని ఉమా సింగ్ కూడా బాలీవుడ్ స్టార్ ని ఆకాశానికి ఎత్తేశాడు!

Exit mobile version