Site icon NTV Telugu

వరుస పరాజయాల్లో విశాల్‌

దీపావళి పండగ సందర్భంగా విశాల్ ‘ఎనిమీ’ విడుదలైంది. రజనీకాంత్‌ ‘పెద్దన్న’తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాడు విశాల్. రజనీకాంత్ సినిమా తమిళనాట అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినా టాక్ బాగాలేకపోడంతో విశాల్ సినిమాకు ప్లస్ అవుతుందేమో అని భావిస్తే పప్పులో కాలేసినట్లే. విశాల్ సినిమాకు తమిళనాడులోనూ తెలుగు రాష్ట్రాలలోనూ కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. ‘ఎనిమీ’ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. రజనీ ‘పెద్దన్న’ తమిళనాట పర్వాలేదనిపించినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కూడా ఫ్లాప్ అనే చెప్పాలి. ఇక విశాల్ విషయానికి వస్తే ఇటీవల కాలంలో తెలుగు మార్కెట్‌లో తన పట్టు కోల్పోయాడనే చెప్పాలి. తెలుగులో విశాల్ చివరి హిట్ ‘డిటెక్టీవ్’ అనే చెప్పాలి. దానికి ముందు కూడా విశాల్ ను ‘జయసూర్య, కథక్కళి, ఒక్కడొచ్చాడు’ వంటి వరుస పరాజయాలు పలకరించాయి. ఇక ‘డిటెక్టీవ్’ తర్వాత వచ్చిన ‘పులిజూదం’, ‘పందెంకోడి2’, ‘అయోగ్య’, ‘చక్ర’ వంటి సినిమాలు ప్లాప్ కాగా ‘అభిమన్యుడు, యాక్షన్’ పర్వాలేదనిపించినా నిర్మాతలకు, పంపిణీదారులక నష్టాలనే మిగిల్చాయి.

ఇక తాజాగా వచ్చిన ‘ఎనిమి’ ఓపెనింగ్స్ సైతం రాబట్టలేకపోయింది. ఇందులో విశాల్ ని చూసినవారు హీరోగా చాలా ఆడ్ గా ఉన్నాడనే కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆకట్టుకునే రూపం లేకున్నా స్వశక్తితో తనని తాను మలచుకుని పట్టుదలతో హీరోగా నిలదొక్కుకుని తానేమిటో నిరూపించుకున్న విశాల్ ఇటీవల కాలంలో తన ఫిజిక్ పై ఫోకస్ పెట్టడం లేదనే విషయం ఇట్టే అర్థం అవుతుంది. నిజానికి ‘ఎనిమీ’లో ఆర్య విశాల్ కంటే వంద రెట్లు బెటర్ గా ఉన్నాడు. విశాల్ ఇతర వ్యాపకాలపై దృష్టి తగ్గించి సినిమాలపై ఫోకస్ పెంచితే బాగుంటుందనే వారు కూడా లేకపోలేదు. ప్రస్తుతం వస్తున్న యంగ్ హీరోలు కానీ, పోటీలో ఉన్న తోటి హీరోలు కానీ తమని తాము అప్ డేట్ చేసుకుంటూ ముందుకు వెళుతుంటే విశాల్ మాత్రం నడిగర్ సంఘం, నిర్మాతల మండలి వ్యవహారాల్లో తలదూర్చి సినిమాలపై ఫోకస్ తగ్గించినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం విశాల్ ‘వీరమే వాగై సూడుమ్, లత్తి, డిటెక్టీవ్2’ సినిమాలు చేస్తున్నాడు. ఇకనైనా విశాల్ ఇతర వ్యాపకాలను పక్కన పెట్టి సినిమాలపై దృష్టి సారించి మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

Exit mobile version