Site icon NTV Telugu

The Kashmir Files : అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర… ప్రధాని సంచలన వ్యాఖ్యలు

The-Kashmir-Files

The Kashmir Files కాశ్మీరీ పండిట్‌లపై 1990లో జరిగిన అఘాయిత్యాల అంశం ఆధారంగా తెరకెక్కి, మార్చి 11న విడుదలైన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో జరిగిన BJP పార్లమెంటరీ సమావేశంలో ఈ సినిమాపై ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే, సినిమా చూడాలని సమావేశంలో పాల్గొన్న ఎంపీలు, నేతలకు సూచించారు. ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని అన్నారు. ‘సత్యాన్ని దేశం ముందుకు తీసుకురావడం దేశ శ్రేయస్సు కోసమే. గత కొన్ని దశాబ్దాలుగా మరుగున పడిన నిజాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇది. నిజాన్ని దాచిన వారే వ్యతిరేకిస్తున్నారు. భిన్నమైన దృక్కోణం ఉన్నవారు మరో కోణంలో కూడా సినిమా తీయవచ్చు” అంటూ చెప్పుకొచ్చారు.

Read Also : The Ghost : ఎడారిలో యాక్షన్.. నాగార్జున స్టంట్స్ స్టార్ట్

‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. వాస్తవాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మెచ్చుకునే బదులు, కాశ్మీర్ ఫైల్స్‌ను అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది పూనుకున్నారని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1975 ఎమర్జెన్సీ లేదా విభజన వంటి అనేక అంశాలపై ప్రామాణికమైన సినిమాలు తీయాలని కూడా ఆయన అన్నారు. ఈ చిత్రం మతపరమైన ఎజెండాను కలిగి ఉందని ఆరోపిస్తూ చిత్ర నిర్మాతలు కొన్ని వర్గాలు నుంచి ఎదుర్కొంటున్న విమర్శల మధ్య ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ సహా అనేక బీజేపి పాలిత రాష్ట్రాలు సినిమాపై వినోదపు పన్నును తొలగించిన విషయం తెలిసిందే. అంతేకాదు కర్ణాటక శాసనసభ్యుల కోసం సినిమా ప్రదర్శన ఏర్పాటు చేయాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ కగేరి సోమవారం అన్నారు.రోజురోజుకూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా సపోర్ట్ పెరిగిపోతోంది.

Exit mobile version