సినీ నటులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే వారి సినిమాలు విడుదల చేయాలి తెలంగాణ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ మూలాలు సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్న ఆయన సినీ నటులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే వారి సినిమాలు విడుదల చేయాలి, ఒకవేళ టెస్టుకు నిరాకరిస్తే వారి సినిమాల విడుదలను ఆపివేయాలని ఆయన అన్నారు. అంతేకాదు ప్రజాప్రతినిధులు అందరూ ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి, టెస్ట్‌కు నిరాకరిస్తే వారిని చట్ట సభలోకి అనుమతించకూడదు అని అనిరుధ్ రెడ్డి అన్నారు.
Also Read:Pawan Kalyan: సినిమా టికెట్ రేట్ల పెంపుపై పవన్ సంచలన వ్యాఖ్యలు
మొయినాబాద్ ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ మేరకు కామెంట్స్ చేయడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది.. పక్కా సమాచారంతో పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించారు. ఈగల్ టీమ్ అధికారులు ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రాగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిద్ మిశ్రా ఫైరింగ్ ప్రారంభించాడు.. పోలీసులను భయపెట్టడానికి కాల్పులు జరిపాడు. నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. తుపాకీ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. ఇక ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందరికీ డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. పార్టీలో పట్టుబడిన 10 మందిలో ఓ మహిళ సైతం ఉంది.. కౌశిక్ రవితో కలిసి ఆ మహిళ వచ్చింది. డ్రగ్స్‌తో పాటు ఫామ్ హౌస్ లోపల ఖరీదైన మద్యం బాటిళ్లు, హుక్కా పైప్స్ సైతం దొరికాయి.
