Site icon NTV Telugu

Virata Parvam: రెండు వారాల ముందే రాబోతున్న కామ్రేడ్ రవన్న!

Rana

Rana

 

దగ్గుబాటి రానా అభిమానులకు రెండు శుభవార్తలను అతని నిర్మాతలు మే 30న కలిగించారు. అందులో మొదటిది వెంకటేశ్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సీరిస్ ‘రానా నాయుడు’ షూటింగ్ పూర్తయిపోయిందనే వార్త. అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సీరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది తెలియచేస్తామని మేకర్స్ తెలిపారు. ఇక రెండోది ఎప్పటి నుండో ఇదిగో అదిగో అంటూ వస్తున్న ‘విరాట పర్వం’ విడుదల తేదీని ప్రీపోన్ చేయడం. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారానికి తెర దించుతూ, ఆ మధ్య ‘విరాటపర్వం’ నిర్మాతలు ఈ మూవీని జూలై1న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే… ఇప్పుడు మనసు మార్చుకుని రెండు వారాల ముందే అంటే జూన్ 17వ తేదీ ఈ సినిమాను రిలీజ్ చేయబోన్నట్టు తెలిపారు.

1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవన్న పాత్రను పోషించారు. సాయి పల్లవి అతని ప్రియురాలు వెన్నెల పాత్రలో కనిపించనుంది. సివిల్ వార్ నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా ‘విరాట పర్వం’ ఉండబోతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. రానా, సాయిపల్లవి, ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వరీ రావ్‌, సాయిచంద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సురేశ్ బాబు దీనికి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. జూన్ 17వ తేదీనే సత్యదేవ్ ‘గాడ్సే’, సుదీప్ కన్నడ అనువాద చిత్రం ‘కె 3’ కూడా విడుదల కానున్నాయి.

Exit mobile version