CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!

  • ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ ప్రీమియర్ షో
  • ప్రేక్షకులతో కలిసి చూడాలని హీరో నాని విజ్ఞప్తి.
  • సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేస్తూ నాని ఎక్స్‌లో పోస్టు.
  • నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన..
  • భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్న నాని నిబద్ధతను సీఎం అభినందన..
  • అధికారిక ప్రక్రియను పాటించాలని సీఎం సూచన..
The Paradise (1)

The Paradise (1)

CM Reply: నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది పారడైజ్’ (The Paradise) సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23న నిర్వహించనున్న ప్రీమియర్ షోను హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని హీరో నాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా కోరారు. ఈ విషయమై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా చూడటం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని నాని పేర్కొన్నారు. ‘ది పారడైజ్’ ప్రీమియర్ షో సందర్భంగా అక్కడి ఓ థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని ఉందని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసు అధికారులను ట్యాగ్ చేస్తూ విజ్ఞప్తి చేశారు. సినిమాను ప్రేక్షకుల కోసమే రూపొందిస్తామని, అలాంటి ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా అనుభవించడంలోనే నటుడిగా తనకు నిజమైన సంతృప్తి లభిస్తుందని నాని తన పోస్టులో పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే సినిమాను అభిమానించే వ్యక్తిగా ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా తాను థియేటర్‌కు వచ్చే సమయంలో అమల్లో ఉన్న అన్ని నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని నాని స్పష్టం చేశారు. ప్రేక్షకుల భద్రత కూడా తమకు అత్యంత ముఖ్యమని పేర్కొంటూ.. తన విజ్ఞప్తిని సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి, సంబంధిత అధికారులు పరిశీలించాలని కోరారు. హీరో నాని చేసిన విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. భద్రతా మార్గదర్శకాలను గౌరవించడంతో పాటు, తెలంగాణకు చెందిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమాపై నాని చూపిస్తున్న నిబద్ధతను అభినందించారు.

అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రీమియర్ షోకు హాజరయ్యేందుకు అధికారిక ప్రక్రియను అనుసరించాలని సీఎం సూచించారు. రద్దీని సజావుగా నిర్వహించడం, ప్రజల భద్రతను నిర్ధారించడం కోసం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారిక దరఖాస్తు సమర్పించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. నాని సమర్పించే దరఖాస్తును సంబంధిత పోలీసు బృందం పరిశీలించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీని కూడా ట్యాగ్ చేశారు.