NTV Telugu Site icon

RaviTeja: రూ. 7 కోట్ల నుంచి 15 కోట్లకు ‘ఖిలాడి’ పారితోషికం ఎందుకు పెరిగింది!?

Raviteja

Raviteja

రవితేజ ‘ఖిలాడి’ సినిమా గత శుక్రవారం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ‘క్రాక్’తో గాడిలో పడిందనుకున్న రవితేజ ఇమేజ్ ని మళ్ళీ అమాంతంగా కిందకు దించింది. ఇక ఈ సినిమా దర్శకుడుతో వివాదం వల్ల రవితేజ ప్రీ- రిలీజ్ ఈవెంట్ కి తప్ప వేరే ఏ ప్రచారం లోనూ పాల్గొనలేదు. ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో పలు రూమర్స్ హల్ చల్ చేశాయి. రవితేజ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడని, అవి ఇచ్చే వరకూ డబ్బింగ్ చెప్పనని అన్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం కూడా ఉంది. అలానే దర్శకుడు రమేశ్ వర్మ, రవితేజకు కూడా పడటం లేదని వినవచ్చింది. అది నిజమని యూనిట్ సభ్యులు కన్ ఫామ్ చేశారు. ఆరంభంలో బాగానే ఉన్న వీరిమధ్య ఎందుకు వివాదాలు చోటు చేసుకున్నాయో చూద్దాం…

నిజానికి కరోనా కంటే ముందు కమిట్ అయిన సినిమా ఇది. అప్పట్లో రవితేజకు వరుసగా ప్లాఫ్ లు ఎదురయ్యాయి. దాంతో ఎవరు 7, 8 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చినా సినిమా చేయటానికి రెడీ అనేశాడు రవితేజ. అదే టైమ్ లో రమేశ్ వర్మకు బెల్లకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ సినిమా రూపంలో హిట్ తగిలింది. రూ. 7 కోట్ల వరకూ లాభం కూడా వచ్చింది. దాంతో నిర్మాతలు అతగాడిని బాగా నమ్మారు. ఇల్లు కొనివ్వటమే కాదు, కారు కోసం రూ.50 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత రవితేజ డేట్స్ ను సంపాదించాడు రమేశ్ వర్మ. గతంలో రవితేజతో ‘వీర’ అనే సినిమా రమేశ్ వర్మ చేశాడు. అది ప్లాప్ అయినా మళ్ళీ డేట్స్ ఎందుకు ఇచ్చాడన్నది రవితేజ ఒక్కడికే తెలియాలి. రవితేజ కథ కంటే పైకానికే ప్రాధాన్యం ఇస్తాడని అందరూ చెబుతున్న మాట. అలా మళ్ళీ రవితేజ, రమేశ్ వర్మ కలయికలో ‘ఖిలాడి’కి బీజం పడింది. అప్పటి మార్కెట్ ప్రకారం రేటు మాట్లాడుకున్నారు. అది అటు ఇటు మారి చివరకు రూ.9 కోట్లుగా ఫిక్స్ అయింది. కొంత భాగం షూటింగ్ పూర్తయిన తర్వాత కరోనా కరాళనృత్యం చేసింది. అప్పుడే రవితేజకు ‘క్రాక్’ రూపంలో భారీ హిట్ పడింది. దాంతో ఒక్కసారిగా పారితోషికం రూ.12 కోట్లకు పెరిగింది. నిర్మాతకు కూడా బిజినెస్ పరంగా ఎంకరేజ్ మెంట్ కనబడటంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. రైట్ అన్నారు. అయితే సినిమా బడ్జెట్ మాత్రం ముందు అనుకున్నది రూ.35 కోట్లు. కానీ బ్రేక్స్ వల్ల… డైరెక్టర్ నెగ్లిజెన్సీ వల్ల నెంబరాఫ్ షూటింగ్ డేస్ తెగ పెరిగాయి. ఫలితంగా బడ్జెట్ రూ.50 కోట్లకు పైగా చేరింది. లక్కీగా ‘క్రాక్’ హిట్ తో హిందీ మార్కెట్ తో పాటు డిజిటల్ రేట్లు కూడా పెరిగి నిర్మాత సేఫ్ జోన్ లోకి వెళ్ళాడు.

ఆ ఆనందంతో ఉన్న నిర్మాతకు రవితేజ రూ.15 కోట్లు డిమాండ్ చేయటం ఆశ్చర్యం కలిగించినా హీరో వల్ల బిజినెస్ రేంజ్ పెరగటంతో సరే అనక తప్పలేదు. ఇక్కడో తిరకాసు ఉంది. అప్పుడెపుడో దర్శకుడు రమేశ్ వర్మ కారు కోసం అడ్వాన్స్ కట్టిన నిర్మాత ఇప్పుడు పూర్తి పేమెంట్ చేసి గిప్ట్ గా ఇచ్చాడు. అది హీరోకి కోపం తెప్పించింది. బాధ్యతారహితంగా వ్యవహరించిన దర్శకుడుకి ఖరీదైన కారు గిప్ట్ గా ఇవ్వటం… 80 రోజులు షూటింగ్ అనుకుని దాదాపు 125 రోజులు పని చేసినా తనపై ఎలాంటి కన్ సర్న్ చూపకపోవడం వల్లే అదనంగా రూ. 3 కోట్లు డిమాండ్ చేశాడని టాక్. అయితే హీరో, దర్శకుల మధ్య వివాదంలో ఎలాంటి సంబంధం లేని నిర్మాత ఇబ్బంది పడవలసి రావటం అన్యాయం అన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ ‘నిర్మాతలు దగ్గరుండి చూసుకోవాలి’ అని చేసిన కామెంట్స్ దర్శకుడు రమేశ్ వర్మను ఉద్దేశించి అనే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అయితే భారీ పారితోషికం తీసుకుని కూడా సినిమాను సరైన విధంగా ప్రమోట్ చేయక పోవటం హీరో రవితేజ తప్పే అన్నది ఎవరూ కాదనలేని సత్యం. నిజానికి నిర్మాతమీద రవితేజకు సాప్ట్ కార్నర్ ఉందని, వారిద్దరి కలయికలో మరో సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదని వినిపిస్తున్న మాట. ఏది ఏమైనా ఇలాంటి వివాదాలు చిత్రపరిశ్రమలో అప్పుడప్పుడు టీ కప్పులో తుఫానులా వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత సడీచప్పుడు లేకుండా సమసిపోతుంటాయి. ఏది ఏమైనా ముల్లు వచ్చి అరిటాకు మీద పడ్డా… అరిటాకు వెళ్ళి ముల్లు మీద పడ్డా అరిటాకుకే నష్టం. అరిటాకు వంటి నిర్మాత పచ్చగా ఉంటేనే ఇండస్ట్రీ కూడా కళకళలాడుతుంది. మరి అరిటాకు వంటి నిర్మాతల్ని చిరిగిపోకుండా చూసుకోవలసిన బాధ్యత ముళ్ళవంటి హీరోలు, దర్శకులదే. ఏమంటారు!?