Cinema to the people: ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్టు మనకు ఇంతకుముందే తెలుసు. గతంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలుచేశారు. ఇప్పుడు అలాంటి విధానమే సినిమాల విషయంలో అందుబాటులోకి రాబోతోంది.
దీన్నే.. ప్రజల వద్దకు సినిమా.. అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల కొత్త సినిమాలను విడుదలైన మొదటి రోజే మొదటి షోనే ఇంట్లో కూర్చొని సకుటుంబ సపరివార సమేతంగా చూసే వీలు కలగనుంది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి వెల్లడించారు. మారుమూల గ్రామాలకు కూడా ఫైబర్‌నెట్ ద్వారా ఈ సౌకర్యాన్ని తీసుకురానున్నామని చెప్పారు. ఫైబర్‌నెట్ సేవలను తక్కువ ధరకే అందిస్తున్నామని పేర్కొన్నారు.
సినిమాలను బట్టి నిర్మాతలకు, ఫైబర్‌నెట్‌కి మధ్య ఒప్పందం కుదురుతుందని తెలిపారు. దీనివల్ల పైరసీకి అవకాశం ఉండదని గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి కూడా స్పందించారు.
గతానికి భిన్నంగా భవిష్యత్తులో.. రిలీజ్ రోజే సినిమాలను పల్లెటూళ్లల్లో చూడబోతున్నామనే అంశం తనకు బాగా నచ్చిందని అన్నారు. పెద్ద హీరోల సినిమాలు సైతం ఫైబర్‌నెట్‌లో విడుదలైతే అభిమానులకు, ప్రేక్షకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.
అయితే.. ఈ నిర్ణయం సినిమా పరిశ్రమకు లాభమా నష్టమా అనేది కూడా చూడాలని పోసాని సూచించారు. ప్రజల వద్దకే సినిమాను చేర్చటం వల్ల ఇండస్ట్రీకి లాభమా నష్టమా అనేది నిర్మాతలకు, ఫైబర్‌నెట్‌కి మధ్య కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
డైరెక్టుగా సినిమాలను ఫైబర్ నెట్ ద్వారా ఇంటింటికీ చేర్చటం వల్ల సినిమా థియేటర్లు, టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లు మూతపడతాయనటంలో ఎలాంటి సందేహంలేదు. దీనివల్ల థియేటర్ల యజమానులు నష్టపోతారు. థియేటర్ల ద్వారా ఉపాధి పొందుతున్నవారు రోడ్డున పడే ప్రమాదం ఉంది.
కానీ.. టికెట్ల కోసం క్యూలైన్లలో నిలబడి ప్రాణాల మీదికి తెచ్చుకునే ప్రేక్షకుల సంఖ్య మాత్రం సున్నాకు పడిపతోంది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఛార్జీలు జనాలకు మిగులుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల వద్దకు సినిమా అనే నిర్ణయం అమల్లోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో విప్లవాత్మక మార్పునకు దారితీస్తుందని చెప్పొచ్చు.
ఇప్పటికే సినిమాలు ఓటీటీల ద్వారా కొంత వరకు ప్రజల వద్దకు వచ్చాయి. వెబ్ సిరీస్‌లు, క్రికెట్ మ్యాచ్‌లు సైతం ఓటీటీల ద్వారా ప్రసారమవుతున్నాయి. అవన్నీ కూడా రానున్న రోజుల్లో ఫైబర్ నెట్ బాట పడతాయని ఆశించొచ్చు. ఈ ప్రయోగం గనక ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైతే ఇతర రాష్ట్రాలు సైతం అనుసరిస్తాయి.