‘300’… ఇలాంటి సింపుల్ టైటిల్ తో వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది… 2007 ఎపిక్ పీరియడ్ యాక్షన్ ఫిల్మ్! అయితే, హాలీవుడ్ లో ఓ సినిమా సక్సెస్ అయితే వెంటవెంటనే సీక్వెల్స్ పుట్టుకు రావటం మామూలే కదా. అదే జరిగింది ‘300’ విషయంలో. దర్శకుడు జాక్ స్నైడర్ తో వార్నర్ బ్రదర్స్ సంస్థ ‘300 : రైజ్ ఆఫ్ యాన్ ఎంపైర్’ రూపొందించింది. 2014లో విడుదలైన కొనసాగింపు కూడామంచి రివ్యూస్, రివార్డ్సే తెచ్చి పెట్టింది. అయితే, అప్పట్నుంచీ ‘300’ ఫ్రాంఛైజ్ లో నెక్ట్స్ ఇన్ స్టాల్మెంట్ గురించి చర్చ కొనసాగుతూనే ఉంది.
2014 తరువాత దాదాపు ఆరేడేళ్లు గడిచిపోతున్నా ‘300’ సిరీస్ లో కొత్త చిత్రం పట్టాలెక్కలేదు. ఇక ముందు కూడా అటువంటి పరిణామం జరిగే ఛాన్స్ లేదని స్వయంగా దర్శకుడే ప్రకటించేశాడు. ఇది ‘300’ లాంటి ఎపిక్ బ్యాటిల్ మూవీస్ ని ఇష్టపడే యాక్షన్ లవ్వర్స్ కి బ్యాడ్ న్యూసే. కానీ, జాక్ స్నైడర్ ఓ ఇంటర్వ్యూలో అసలు సంగతి బయట పెట్టేశాడు.
వార్నర్ బ్రదర్స్ సంస్థ స్నైడర్ కి మరో సీక్వెల్ చేద్దామంటూ ఆఫర్ ఇచ్చిందట. దర్శక, రచయిత కూడా కథ సిద్ధం చేసేందుకు పూనుకున్నాడట. కానీ, చివరకు ఆయన రాసుకున్నది ఓ గే లవ్ స్టోరీగా పరిణమించింది. అలెగ్జాండర్, ద గ్రేట్… తన ప్రాణ స్నేహితుడైన హెప్ హెయిస్టియన్ తో శారీరిక సంబంధం పెట్టుకున్నాడని చరిత్ర చెబుతోంది. వారిద్దరి మధ్య గే లవ్ ని తెర మీద చూపించాలని, ఆ సీక్వెల్ కి ‘300 : బ్లడ్ అండ్ యాషెస్’ అనే టైటిల్ పెట్టాలని స్నైడర్ అనుకున్నాడు. కానీ, ‘300’ సిరీస్ లో గే లవ్ స్టోరీ వద్దని వార్నర్ సంస్థ తోసిపుచ్చిందట. అందుకే, స్నైడర్ ఇక సీక్వెల్ కష్టమంటూ ప్రకటించేశాడు!
ఇప్పటికిప్పుడైతే జాక్ స్నైడర్ రాసుకున్న ‘బ్లడ అండ్ యాషెస్’ అలెగ్జాండర్ లవ్ స్టోరీ వృథా అనే భావించాలి. భవిష్యత్ లో ఏ నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ జెయింటో నిధులు సమకూర్చి ఆ సబెక్ట్ ని సినిమాగా మన ముందుకు తీసుకురావచ్చు! మరి ‘300’ సంగతేంటి? వార్నర్ బ్రదర్స్ నిర్ణయిస్తే… తగిన ఎపిక్ యాక్షన్ తో జాక్ స్నైడర్ కాకుండా మరెవరైనా సీక్వెల్ కి దర్శకత్వం వహించవచ్చు! రెండూ సినిమాలు తెర మీదకి రావాలని సినిమా ప్రియులైతే కోరుకుంటున్నారు…