టాలీవుడ్‌లో ఎప్పటి నుండో ఒక ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాలులేదా ఏదైనా ఒక భారీ బడ్జెట్ చిత్రం విడుదల తేదీకి దగ్గరపడుతోందంటే చాలు.. “ఆ సినిమా వాయిదా పడుతోంది” అనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాల్సిందే. ఇటీవల ‘ది ప్యారడైజ్’, డిసెంబర్ బరిలో ఉన్న ‘ఫౌజీ’, ‘దాదా’ వంటి చిత్రాల విషయంలోనూ ఇదే తరహా ప్రచారం ఊపందుకుంది.
అందుకు ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయిలెండి. ప్రభాస్ నటించిన రాజాసాబ్ ఎన్నో సార్లు పోస్ట్ పొన్ అవుతూ వచ్చి డిజాస్టర్ అయింది. ఇక ఇటీవల వచ్చిన యశ్ టాక్సిక్ కూడా ఎన్నో సార్లు వాయిదాలు పై వాయిదాలు వేస్తూ రిలీజై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో పెద్ద సినిమాలు అంటే పోస్ట్ పోన్ పక్కా అనే ట్రెండ్ స్టార్ట్ అయింది. సాధారణంగా పెద్ద సినిమాల గ్రాఫిక్స్ పనులు, రీ-రికార్డింగ్ లేదా చివరి నిమిషం ప్యాచ్‌వర్క్ షూటింగ్‌లలో కొద్దిపాటి ఆలస్యం జరిగినా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో పోస్ట్‌పోన్ రూమర్లు ఊపందుకుంటాయి. అయితే ప్రమోషన్ల హోరు పెరగాల్సిన సమయంలో ఇటువంటి వార్తలు రావడం వల్ల అభిమానుల్లో తీవ్ర అయోమయం నెలకొంటోంది. అయితే చాలా సందర్భాల్లో ఈ పుకార్లలో ఎటువంటి నిజం ఉండటం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ రైట్స్ ఒప్పందాలు చాలా కఠినమైన నిబంధనలతో జరుగుతున్నాయి. నిర్మాతలు ప్రకటించిన తేదీకి థియేటర్లలోకి రాకపోతే ఓటీటీ బిజినెస్‌పై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే నిర్మాణ సంస్థలు తమ పనులను రాత్రింబవళ్ళు కష్టపడి పూర్తి చేస్తూ పోస్ట్‌పోన్ వార్తలకు పోస్టర్ల ద్వారా వెంటనే చెక్ పెడుతున్నాయి. “పెద్ద సినిమా రూమర్లు సహజమే.. కానీ అనుకున్న సమయానికే వస్తాం” అని క్లారిటీ ఇస్తున్నారు.

