Site icon NTV Telugu

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎందుకు ఇన్వాల్ అయ్యిందంటే ?

Why Enforcement Directorate Involved in Tollywood Drugs Case?

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ సెలెబ్రిటీల పేర్లు ఇందులో బయటకు వచ్చాయి. 2017 లోనే ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు రవితేజ, ఛార్మి, రకుల్, రానా, తరుణ్, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్ తదితరుల నుంచి శాంపిల్స్ ను సేకరించి డ్రగ్స్ నిర్ధారణ పరీక్ష కోసం ల్యాబ్ కు పంపారు. ఆ తరువాత ఈ కేసులో వేగం తగ్గిపోయింది. తాజాగా ఈడీ సెలెబ్రెటీలకు నోటీసులు పంపడంతో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు ఈ సెలెబ్రిటీలంతా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

అయితే ఇది డ్రగ్స్ కేసు కదా. మత్తుపదార్థాలకు సంబంధించిన కేసును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టాలి. మరి ఇందులో ఈడీ ప్రమేయం ఎందుకు ఉంది ? వారికి ఈడీ ఎందుకు నోటీసులు జారీ చేసింది ? అనే డౌట్ రావొచ్చు. అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పలువురు విదేశీయులను ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కింగ్ పిన్ కెల్విన్, మైక్ కమింగా, విక్టర్ లాంటి సూత్రధారులను అరెస్టు చేయడంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. అయితే అరెస్ట్ అయిన వీళ్లంతా విదేశాలకు సంబంధించిన పౌరులు. కానీ గోవా డ్రగ్ మాఫియాతో వీరందరికీ సత్సంబంధాలు ఉన్నాయి. సౌతిండియాలోని సినిమా తారలు, ఐటీ కంపెనీలో ఉద్యోగులు, స్కూలు, కాలేజీ పిల్లలను టార్గెట్ చేస్తూ ఈ డ్రగ్ మాఫియా కొనసాగుతోంది.

Read Also : మిస్టర్ బైడెన్… చెప్పు తెగుద్ది ఎదవ : నిఖిల్

ఎండిపిఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ నివారణ కోసం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మాత్రమే కాకుండా అన్ని దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేవలం రాష్ట్ర పరిధిలో ఉన్న ఎక్సైజ్ శాఖ, సిట్ దర్యాప్తు లకే పరిమితం చేయడంతో హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. విదేశీయులుగా ఉన్న పౌరులు ఈ కేసులో నిందితులుగా ఉండడంతో మనీలాండరింగ్ పెద్ద ఎత్తున జరిగి ఉండొచ్చని ఆరోపణలు వచ్చాయి. విదేశాలలో తయారవుతున్న డ్రగ్స్ కు కింగ్ పిన్ లు హైదరాబాద్ లో మకాం వేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ, సెంట్రల్ ఎకానామిక్స్ ఇంటలిజెన్స్ బ్యూరోతో దర్యాప్తు చేయించాలని కోర్ట్ లో పిటిషన్లు దాఖలయ్యాయి. అలా ఈ కేసులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది.

2020 నవంబర్ లో ఈ విషయంపై సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ కమిషనర్ కు ఈడి లేఖ రాసింది. 2017లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్ లు ఇవ్వాలని ఎక్సైజ్ కమిషనర్ కు ఈడీ లేఖ రాసింది. అయితే ఎక్సైజ్ శాఖ నుండి ఎలాంటి సమాచారం రాలేదని గతంలోనే ఈడీ కోర్టుకు తెలిపింది. ఎక్సైజ్ శాఖ సేకరించిన స్టేట్మెంట్లు, డిజిటల్ పరికరాలు, సాక్ష్యాలు, రిపోర్ట్ కాపీలు ఇవ్వాలని గతంలోనే హైకోర్టును కోరింది ఈడి. రాహుల్ సింఘానియా ఈడీ డెప్యూటీ డైరెక్టర్ కోర్ట్ లో అఫిడవిట్ దాఖలు చేశాడు. తాజాగా ఎక్సైజ్ శాఖ నుండి కేసుకు సంబంధించిన వివరాలు అందటంతో రంగంలోకి ఈడి రంగంలోకి దిగింది. ఈ కేసు తరువాత ఎలాంటి మలుపులు తిరుగుతుందా ? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version