Vrushakarma Trailer: అక్కినేని నాగచైతన్య హీరోగా, కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నెల్లూరులో జరిగింది. అక్కినేని అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ వేడుకలో నాగచైతన్య ఈ సినిమాకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా ఇందులో పాటలు, లవ్ స్టోరీ లాంటివి ఏవీ ఉండవని, కానీ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు సీటు అంచున కూర్చునేలా విజువల్స్ ఉంటాయని చైతూ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మీనాక్షి చౌదరి గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సాధారణంగా సినిమాల్లో ఉండే లవ్ స్టోరీ, డ్యూయెట్ సాంగ్స్ లాంటివి ఈ సినిమాలో అస్సలు ఉండవు. అయినా సరే, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, ఒక నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే డేరింగ్‌తో మీనాక్షి ఈ సినిమా ఒప్పుకుంది. అందుకు ఆమెకు థ్యాంక్స్” అంటూ చైతూ ప్రశంసించారు.
సినిమా విజువల్స్, రన్ టైమ్ గురించి చైతూ మాట్లాడుతూ.. “ఈ కథ విన్నప్పుడు నాకు ఎలాంటి రిఫరెన్స్ దొరకలేదు. అంత ఒరిజినల్‌గా, ఫ్రెష్ ఐడియాతో దర్శకుడు కార్తీక్ దీన్ని రాశాడు. ఈ సినిమా మొత్తం 2 గంటల 50 నిమిషాలు ఉంటే, అందులో దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు ప్రతి ఫ్రేమ్‌లోనూ ఏదో ఒక విఎఫ్ఎక్స్, కొత్త విషయం కనిపిస్తూనే ఉంటుంది. ఆ విజువల్స్‌ను పర్ఫెక్ట్‌గా తీసుకురావడానికి మా డైరెక్టర్ కార్తీక్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు. అందుకే ఇవాళ ఈ ఈవెంట్‌కు కూడా రాలేకపోయాడు. గుర్తుపెట్టుకోండి.. తెలుగు నుంచి వచ్చి ఇండియాను షేక్ చేసిన గొప్ప దర్శకుల లిస్టులో త్వరలోనే మా కార్తీక్ కూడా చేరబోతున్నాడు” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన స్పర్శ్ కష్టాన్ని కూడా నాగచైతన్య కొనియాడారు. “ట్రైలర్‌లో మీరు చూసిన స్పర్శ్ పాత్ర సినిమా చూశాక కచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక రాక్షసుడిలా కనిపించే ఆ పాత్ర కోసం రోజుకు ఆరు గంటల పాటు మేకప్ వేసుకునేవాడు. మళ్లీ పొద్దున్నే షూటింగ్‌కు వెళ్లాలని రాత్రి అదే మేకప్‌తో నిద్రపోయేవాడు. ఆ బాడీ లాంగ్వేజ్ కోసం అతను పడిన కష్టం మామూలుది కాదు” అని చెప్పారు. అలాగే, ఎన్ని కష్టాలు వచ్చినా ఒకే నవ్వుతో ‘నేను చూసుకుంటాను బాబు’ అంటూ అండగా నిలిచిన నిర్మాత ప్రసాద్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్ నవీన్ నూలి, విఎఫ్ఎక్స్ టీమ్‌కు చైతూ కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 4న రాబోతున్న ‘వృషకర్మ’ టాలీవుడ్ గర్వపడే సినిమా అవుతుందని స్పష్టం చేశారు.

