తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుభవం, వైవిధ్యం కలబోసిన సీనియర్ నటుడు వీకే నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నరేష్.. కాలానికి తగ్గట్టు తన పాత్రలను మార్చుకుంటూ ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తున్నారు. హీరోగా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారినా తనదైన ముద్ర వేసారు. ఇటీవల సినిమాల్లో ఆయన పోషిస్తున్న పాత్రలు కథకు బలాన్ని చేకూరుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.
ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంలో నరేష్ అద్భుతంగా నటించారు. లేటు వయసులో లేచిపోయి పెళ్లి చేసుకునే క్యారెక్టర్‌లో జీవించేశారు. నరేష్ కనిపించినప్పుడల్లా థియేటర్లలో నవ్వులు పూశాయి. కే ర్యాంప్, సామజవరగమన సినిమాల్లో కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. శుభకృత్ నామ సంవత్సరం, క్రేజీ కల్యాణం, గరివిడి లక్ష్మి, హే భగవాన్ సినిమాల్లో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో కొత్త సినిమా పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి.
ఇటీవలి సినిమాల్లో నరేష్ నటన, అనుభవం, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. నెట్టింట ట్వీట్లు చూస్తే ఆయన క్రేజ్ ఇంకా తగ్గలేదని అర్ధమవుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా నటనలో కొత్తదనాన్ని చూపిస్తూ.. ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నరేష్‌కు ఇదే ఉత్సాహంతో మరిన్ని మంచి పాత్రలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
