Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అందులో బోలెడంత వైబ్రెంట్ ఎనర్జీ, ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం ‘కల్ట్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఎన్టీవీ ఇంటర్వ్యూలో విశ్వక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు విశ్వక్ ఇచ్చిన సమాధానం హైలైట్‌గా నిలిచింది. “‘కల్ట్’ సినిమాలో ఏసీపీ పాత్రకు మీరే పర్ఫెక్ట్ అని మేము నమ్ముతున్నాం. ఒకవేళ ఫుల్ కమిట్‌మెంట్స్ వల్ల మీరు ఆ రోల్ చేయలేకపోతే.. ఆ కథను ప్రేక్షకులకు తీసుకెళ్లడానికి మీ ఫస్ట్ ఆప్షన్ ఎవరు?” అని ప్రశ్నించగా, విశ్వక్ ఏమాత్రం తడుముకోకుండా నవ్వుతూ “నాకు తారక్ అన్ననే కనిపిస్తాడు.. ఆ రోల్‌కు నా ఫస్ట్ ఛాయిస్ ఆయనే” అంటూ ఎన్టీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు.
భవిష్యత్తులో ఎన్టీఆర్‌తో సినిమా చేసే ఆలోచన లేదా డైరెక్షన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా అని అడగ్గా విశ్వక్ చాలా సరదాగా స్పందించారు. “అసలు డైరెక్షన్ చేయొద్దని నాతో స్వయంగా స్టేజ్ మీదే చెప్పింది తారక్ అన్నే. అలాంటిది మళ్లీ నేను డైరెక్షన్ చేస్తానంటూ ఆయన దగ్గరికి వెళ్తే ఫస్ట్ నన్ను కొడతారేమో.. నువ్వు ముందు యాక్టింగ్ చెయ్ అని అంటారు” అంటూ సరదాగా గుర్తు చేసుకున్నారు. ఇక సినిమా మేకింగ్ ట్రెండ్‌పై మాట్లాడుతూ.. “ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసేవాళ్లు. అప్పట్లో కెమెరా రోల్ ఎక్కువ సేపు అయ్యేది, కట్స్ చాలా తక్కువగా ఉండేవి. ఒక సినిమా మొత్తం చూసినా 200 షాట్ల కంటే తక్కువే ఉండే సందర్భాలుండేవి. కానీ ఇప్పుడు మూడు నిమిషాల ఫైట్ సీన్‌లోనే ఏకంగా 500 కట్స్ ఉంటున్నాయి. డిజిటల్ టెక్నాలజీ వచ్చాక అందరికీ సమానమైన టూల్స్ దొరికాయి, కానీ ఎవరు బెస్ట్ సినిమా ఇస్తున్నారనే పోటీ విపరీతంగా పెరిగింది” అని వివరించారు.

