Vijay Deverakonda: టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ఉదారతతో రియల్ లైఫ్ హీరోలుగా నిలిచారు. పెళ్లి పీటలపై తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘ది దేవరకొండ ఫౌండేషన్’ (The Deverakonda Foundation) తరఫున మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందజేశారు. బల్మూరు మండలంలోని తుమ్మన్‌పేట గ్రామానికి విజయ్ దేవరకొండ కుటుంబంతో విడదీయరాని బంధం ఉంది. అది విజయ్ తండ్రి గోవర్ధన్ స్వగ్రామం. రష్మికతో వివాహం అనంతరం ఈ గ్రామానికి సతీసమేతంగా విచ్చేసిన విజయ్.. అక్కడే తన వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరుపుకున్నారు. ఆ రోజే అచ్చంపేట డివిజన్‌లోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదివే పేద మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇస్తానని ప్రామిస్ చేశారు. తాజాగా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన వేళ.. ఆ నియోజకవర్గంలో 1, 2 ర్యాంకులు సాధించిన 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించి తన మాట నిలబెట్టుకున్నారు.
ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాం: విజయ్ దేవరకొండ
విద్యార్థులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. “మీరు సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేయడానికే మేమంతా ఇక్కడికి వచ్చాం. మార్కులు ఎక్కువ రావడం కంటే.. దానికోసం మీరు పడిన శ్రమ, చూపిన ఏకాగ్రత చాలా గొప్పవి. నేను, రష్మిక మా స్టూడెంట్ లైఫ్‌లో ఎప్పుడూ టాపర్స్ కాదు. నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణలోనే టెన్త్ రిజల్ట్స్‌లో సెకండ్ ప్లేస్ సాధించిందని డీఈఓ గారు చెప్పడం చాలా గర్వంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా ఇక్కడి టీచర్లదే. మా నాన్న, అమ్మ ఈ ఊరితో పెంచుకున్న అనుబంధం వల్లే నేడు నేను ఈ ఛారిటీ చేయగలుగుతున్నాను. మీ అందరి జీవితాల్లో నేను ఒక భాగం కావాలనే ఈ ప్రయత్నం. ఇప్పుడు అచ్చంపేటలో స్టార్ట్ చేశాం.. నెక్స్ట్ నాగర్ కర్నూలు జిల్లా మొత్తం, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల పేద మెరిట్ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ అందించడమే మా ఫౌండేషన్ కల. వచ్చే ఏడాది కూడా ‘విజయ్ అన్న వస్తాడు, స్కాలర్‌షిప్ ఇస్తాడు’ అనే ఉత్సాహం పిల్లల్లో కలగాలి. ఈ సాయం నిజమైన అర్హులకు మాత్రమే అందేలా చూడాలని అధికారులను కోరుతున్నాను. విద్యార్థులందరికీ నా ఆల్ ది బెస్ట్” అని అన్నారు.
నేను మీ అంత మెరిట్ స్టూడెంట్‌ని కాదు: రష్మిక మందన్న
“ది దేవరకొండ ఫౌండేషన్ తరఫున ఈ మంచి పని చేయాలనుకున్నప్పుడు.. మొదట మామయ్య పుట్టిన ఊరైన తుమ్మన్‌పేట, అచ్చంపేటలోనే ప్రారంభించాలని ఫిక్స్ అయ్యాం. ఇక్కడ ఇంతమంది పిల్లలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే.. నేను మీ వయసులో ఉన్నప్పుడు మీ అంత మెరిట్ స్టూడెంట్‌ని కాదు, చదువులో నన్ను మీరు దాటేశారు. జీవితంలో గెలుపోటములు సహజం.. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. మీ తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ గొప్పగా ఎదగండి” అని విద్యార్థులకు సూచించారు. విజయ్ మాతృమూర్తి మాధవి మాట్లాడుతూ.. పిల్లలు తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే డ్యూటీ (Duty), డిసిప్లిన్ (Discipline), డివోషన్ (Devotion), డెడికేషన్ (Dedication), డిటెర్మినేషన్ (Determination) అనే ఈ ఐదు ‘డి’లను కచ్చితంగా పాటించాలన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. “జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా విజయ్ దేవరకొండ తన సొంత ఊరును, మూలాలను మర్చిపోలేదు. అది ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా స్కాలర్‌షిప్స్ ఇవ్వడం అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తామని విజయ్ చెప్పడం సంతోషంగా ఉంది. విజయ్ మన అచ్చంపేట వాసి కావడం మనందరికీ గర్వకారణం.”
ఈ వేడుకలో విజయ్, రష్మికలతో పాటు విజయ్ మాతృమూర్తి మాధవి, తండ్రి గోవర్ధన్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా విద్యాధికారి (DEO) రమేష్, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెళ్లి తర్వాత విదేశీ విహారయాత్రలకు వెళ్లకుండా, తండ్రి పుట్టిన ఊరిలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లల చదువుల కోసం విరాళాలు ప్రకటిస్తూ అండగా నిలిచిన ఈ స్టార్ కపుల్‌పై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
Another Good day ❤️
Just Wrapped year 1 of Scholarships to 45 schools – 180 students.
Look forward to seeing you all again in 2027 June ❤️ will work towards making it bigger.
Lots of love from us all.
Your man,
Vijay. pic.twitter.com/1GceBOKOO7— Vijay Deverakonda (@TheDeverakonda) June 14, 2026

