ఒకప్పటి పాపులర్ హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న వాణీ విశ్వనాథ్ కుటుంబం నుండి మరొకరు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆమె సోదరి కుమార్తె వర్షా విశ్వనాథ్ ‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రమణ్ హీరోగా కె. శిరీషా రమణారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం. రమేశ్, గోపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ మూవీలో పక్కింటి అమ్మాయిని తలపించే పాత్రను వర్ష చేస్తోందని, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని దర్శక నిర్మాతలు తెలిపారు. మే 3 వర్షా విశ్వనాథ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ‘జయ జనకీ నాయక’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన వాణీ విశ్వనాథ్ ఇటీవల ‘ఒరేయ్ బుజ్జిగా’లోనూ కీలక పాత్ర పోషించారు.