Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్‌డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!

Varanasi Update Latest

Varanasi Update Latest

Varanasi Movie Latest Update: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. వారణాసి సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు 85 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. మిగిలిన 15 శాతం షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాను అనుకున్న డేటుకే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర బృందం వర్క్ చేస్తోందట.

వాస్తవానికి దర్శకుడు రాజమౌళి సినిమాల విషయంలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం తీసుకుంటారనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. దీంతో వారణాసి కూడా వాయిదా పడే అవకాశం ఉందని చాలామంది భావించారు. అయితే ఈసారి మాత్రం అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో రాజమౌళి ముందుకు సాగుతున్నారట. ఎలాంటి జాప్యం లేకుండా పగడ్బందీగా అన్ని ప్లాన్ చేశారట. వారణాసి 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. కథ, విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు అత్యాధునిక సాంకేతికత ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

‘వారణాసి’కి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఐమ్యాక్స్ వెర్షన్. భారతీయ సినిమా చరిత్రలో పూర్తిస్థాయి ఐమ్యాక్స్ వెర్షన్‌లో రూపొందుతున్న రెండో ప్రాజెక్ట్‌గా ఈ సినిమా నిలవనుంది. భారీ స్క్రీన్‌పై అద్భుతమైన విజువల్స్‌ను ప్రేక్షకులకు అందించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. దీంతో థియేటర్లలో ఈ సినిమా అనుభూతి మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరి కాంబినేషన్ సినిమాపై ఇప్పటికే భారీ ఆసక్తిని పెంచింది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ, కెఎల్ నారాయణ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.