Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్‌పైనేనా?

Rajamouli On Varanasi Movie Story

Rajamouli On Varanasi Movie Story

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో ఒక కొత్త బజ్ మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఐమ్యాక్స్ వెర్షన్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని మేకర్స్ ఎప్పుడో డేట్ లాక్ చేశారు. కానీ, తాజాగా ఈ రిలీజ్ డేట్ మారబోతోందంటూ వినిపిస్తున్న వార్తలు టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

నిజానికి రాజమౌళి సినిమాలకు బాక్సాఫీస్ రికార్డులు ఎంత సహజమో.. రిలీజ్ వాయిదాలు పడటం కూడా అంతే కామన్ అనే విమర్శలు ఉన్నాయి. గత కొంతకాలంగా ‘వారణాసి’ షూటింగ్, భారీ వీఎఫ్ఎక్స్ (VFX) పనుల దృష్ట్యా ఏప్రిల్ 7 డేట్ మిస్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో, జక్కన్న కన్ను మరో భారీ పాన్ ఇండియా స్లాట్‌పై పడిందనే కొత్త రూమర్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఆ స్లాట్ మరేదో కాదట.. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ పార్ట్ 2’ వదిలిన దీపావళి సీజన్ అని టాక్. ఇండియన్ సినిమా నుంచి గ్లోబల్ స్థాయిలో ఐమ్యాక్స్ వెర్షన్‌లో ప్లాన్ చేసిన రెండే రెండు భారీ చిత్రాలు ‘రామాయణ’, ‘వారణాసి’. వీటిలో ఇప్పటికే ‘రామాయణ’ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అయితే, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ‘రామాయణ పార్ట్ 2’ చిత్రాన్ని 2027 దీపావళికి విడుదల చేయాల్సి ఉంది.

కానీ, ఇటీవల పార్ట్ 1 విడుదల సందర్భంగా.. రెండో భాగాన్ని ఏకంగా ఏడాది పాటు వాయిదా వేస్తూ 2028 దీపావళికి షిఫ్ట్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. దీంతో 2027 దీపావళికి పాన్ ఇండియా, ఐమ్యాక్స్ మార్కెట్‌లో ఒక క్రేజీ స్లాట్ ఖాళీ అయింది. ఒకవేళ ఏప్రిల్ 7 నాటికి పనులు పూర్తి కాకపోతే, ‘రామాయణ 2’ వదిలిన ఈ దీపావళి స్లాట్‌ను రాజమౌళి లాక్ చేసుకునే ఆలోచనలో ఉన్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ రూమర్లలో ఎంతవరకు నిజముందో.. జక్కన్న టీమ్ స్పందించి ఏప్రిల్ రిలీజ్‌నే కన్ఫర్మ్ చేస్తుందో లేక కొత్త డేట్ ఇస్తుందో చూడాలి.