Varanasi Theatrical Rights: రికార్డు డీల్.. ‘వారణాసి’ థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!

Mythri Movie Makers Varanasi

Mythri Movie Makers Varanasi

Varanasi Movie Theatrical Rights: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్‌ అడ్వెంచర్‌ మూవీ ‘వారణాసి’. బాలీవుడ్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. 2027 ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న వారణాసిపై ఏ చిన్న న్యూస్ వచ్చినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. సినిమా బిజినెస్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.290 కోట్ల భారీ డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ డీల్‌కు సంబంధించి చిత్రబృందం లేదా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఒప్పందం నిజమైతే.. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌లో సరికొత్త రికార్డుగా నిలవనుంది. ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ ఉంది. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్‌ రూ.225 కోట్ల ధర పలికింది. వారణాసి థియేట్రికల్ రైట్స్‌ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌‌మెంట్స్ కూడా పోటీపడ్డాయని.. చివరకు మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

మహేశ్ బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో వారణాసిపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ స్థాయి కథాంశం, భారీ నిర్మాణ విలువలు, స్టార్ కాస్ట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఈ నేపథ్యంలో సినిమా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ వార్తతో మహేశ్ బాబు అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ఇప్పటివరకు వారణాసి నుంచి కొన్ని స్టిల్స్‌, ఓ గ్లింప్స్‌ మాత్రమే వచ్చాయి. దీంతో మేజర్ అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నవంబర్‌లో వారణాసి నుంచి మరో భారీ రివీల్‌ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.