Pan-India: ఇప్పుడు ఏ చిన్న సినిమా మొదలైనా ‘పాన్ ఇండియా’ లెక్కలు వేసుకుంటూ, ఆ హడావిడిలోనే కథలను వెతుక్కుంటున్నారు. భారీ యాక్షన్, రక్తపాతం, ఇతర భాషల నటీనటులను బలవంతంగా ఇరికించి ప్రాజెక్ట్ పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి పాన్ ఇండియా ఫార్ములాలపై స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా నిర్మొహమాటంగా, ప్రాక్టికల్‌గా రియాక్ట్ అయ్యారు. ‘ఆదర్శ కుటుంబం’ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలోని ఆలోచనా విధానాన్ని ప్రశ్నించేలా మారాయి.
“మీకున్న నాలెడ్జ్‌కు ఈ ఫ్యామిలీ సంబంధాలు దాటి పెద్ద స్థాయి పాన్ ఇండియా సినిమాలు చేయొచ్చు కదా?” అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు త్రివిక్రమ్ సూటిగా బదులిచ్చారు. “మనం ప్రత్యేకంగా కూర్చుని ప్రయత్నం చేస్తే, ప్లాన్ చేస్తే సినిమాలు పాన్ ఇండియా స్థాయికి వెళ్లవు. మనం రాసే కథ బలంగా ఉండాలి. ఆ కథే మనల్ని అంత దూరం నడిపించుకుంటూ తీసుకెళ్లాలి తప్ప, మనం బలవంతంగా ఒక సినిమాను అక్కడికి తోయలేం” అని తేల్చి చెప్పారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను వదిలి బయటకు రాలేకపోతున్నారన్న విమర్శలకు కూడా గురూజీ తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. “అసలు మనుషులు, వాళ్ల మధ్య ఉండే సంబంధాలు కాకపోతే కథల్లో ఇంకేముంటుంది ప్రపంచంలో? చివరకు ఏ దేశం వాళ్లయినా, ఏ భాష సినిమా అయినా కనెక్ట్ అయ్యేది ఆ హ్యూమన్ ఎమోషన్స్‌కే కదా” అంటూ చెప్పుకొచ్చారు. మార్కెట్ ట్రెండ్ కోసం కథలను మార్చడం కాకుండా, సహజమైన భావోద్వేగాలతో రాసినప్పుడే అది సహజంగానే దేశ సరిహద్దులు దాటుతుందన్న త్రివిక్రమ్ మాటలు సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.

