టాలీవుడ్ లో గత 18 రోజులుగా జరుగుతున్న బంద్ కు ఎండ్ కార్డ్ పడింది. తెలంగాణ ప్రభుత్వ జోక్యంతో ఈ బంద్ కు ముగింపు పలికారు కార్మిక సంఘాలు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డికి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. వారిలో…
మెగాస్టార్ చిరంజీవి : ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా, ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు తీసుకొంటున్న చర్యలు అభినందనీయం. హైదరాబాద్ ను దేశానికే కాదు, ప్రపంచ చలన చిత్ర రంగానికే ఓ హబ్ గా మార్చాలన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగినవి. తెలుగు చిత్రసీమ ఇలానే కలిసి మెలిసి ముందుకు సాగాలని, ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా.
నాగవంశీ : తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యను పరిష్కరించి మరియు పురోగతి వైపు నడిపించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి అలాగే ఈ ప్రయత్నంలో కలిసి నిలిచినందుకు ఫిల్మ్ ఛాంబర్ మరియు సంఘాల తరపున రోహిన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
మైత్రీ మూవీ మేకర్స్ : తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యను పరిష్కరించి సమ్మెను ముగించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మీ దార్శనికత మరియు మద్దతు మన సినిమా సంక్షేమం మరియు పురోగతి పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి రోహిన్ రెడ్డికి ఫిల్మ్ ఛాంబర్, సంబంధిత సంఘాలు మరియు బ్యూరోక్రాట్ల తరపున ధన్యవాదాలు.
