Tollywood: టాలీవుడ్ కాదు.. ఇంటర్నేషనల్!

Tollywood International

Tollywood International

తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే పాన్ వరల్డ్ మూవీనే. నిన్నటి వరకు పాన్ ఇండియా మూవీ కోసం హిందీ, కన్నడ, తమిళం, మలయాళం నుంచి నటీనటులను దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది, ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్‌ని రంగంలోకి దింపుతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జతకట్టిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. 1854-78 మధ్య బ్రిటిష్ కాలం నాటి కథతో ఇది రూపొందుతోంది. ‘ది మమ్మీ’ మూవీ విలన్ అర్నాల్డ్ వోస్లూ, రణబాలిలో ‘సర్ థియేటర్ హెక్టర్’ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

హాలీవుడ్ యాక్టర్స్‌తో పని చేయడం జక్కన్నకు కొత్తేమీ కాదు. ఆర్ఆర్ఆర్ (RRR) లో జెనిఫర్‌గా ఒలివియా మోరిస్, గవర్నర్‌గా రే స్టీవెన్సన్, లేడీ స్కాట్‌గా అలిసన్ డూడీ నటించారు. ‘వారణాసి’ ఏకంగా పాన్ వరల్డ్ మూవీగా రూపొందడంతో, చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్‌తో వర్క్ చేస్తున్నాడు జక్కన్న. వారణాసి యాక్షన్ అడ్వెంచర్ మూవీగా వస్తోంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడన్న టాక్ వచ్చినా, మెయిన్ విలన్‌గా హాలీవుడ్ యాక్టర్ క్రిస్ హేమ్స్‌వర్త్ పేరు వినిపిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన 41 ఏళ్ల క్రిస్, వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్‌లో ఒకడు.

×
×
Ad

హాలీవుడ్ యాక్టర్స్‌ని తీసుకొచ్చే ట్రెండ్ పూరి జగన్నాథ్‌తో స్టార్ట్ అయింది. ‘లైగర్’ కోసం ఏరికోరి మైక్ టైసన్‌ని తీసుకొచ్చాడు పూరి. పెద్దగా ఇంపార్టెన్స్ లేని రోల్‌ని టైసన్‌కి ఇవ్వడంతో, సినిమా ఫ్లాప్ కావడంతో మైక్ టైసన్‌కి మరో ఛాన్స్ దక్కలేదు. ఎప్పటికప్పుడు వాయిదా పడి, పట్టాలెక్కిన ప్రభాస్ – సందీప్ వంగ మూవీ ‘స్పిరిట్’ కోసం కొరియన్ స్టార్ డాన్ లీ ని తీసుకుంటున్నారట. ఈ హాలీవుడ్ స్టార్ కి ఆల్రెడీ కథ చెప్పిన సందీప్, పేరు అనౌన్స్ చేయాల్సి ఉంది.

మాఫియా బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ‘డ్రాగన్’ లో ‘డ్యూన్’ ఫేమ్ బెనడిక్ట్ గార్రెట్, అలెగ్జాండర్ మిజోవ్ వంటి ఇంటర్నేషనల్ నటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. లీడ్ రోల్స్ రెమ్యూనరేషన్ కోసమే కోట్లు కుమ్మరిస్తున్నారు. హీరోకు 100 కోట్లు, డైరెక్టర్‌కు 100 కోట్లతో పాటు.. హాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన స్టార్స్ కు కూడా భారీగా ముట్టజెప్పుతున్నారు. దీంతో పాన్ వరల్డ్ మూవీస్ బడ్జెట్ 800 నుంచి 1000 కోట్లకు చేరుతోంది. వారణాసి రేంజ్ అయితే 1000 కోట్లు దాటిపోయింది.