Anupama Parameswaran: హోమ్లీ లుక్ తో చూపరులను ఇట్టే ఆకట్టుకొనే అందం అనుపమా పరమేశ్వరన్ సొంతం! వచ్చీ రాగానే తెలుగువారి మదిని దోచిన ఈ ముద్దుగమ్మ తనదైన పంథాలో పయనిస్తోంది. గత సంవత్సరం ‘కార్తికేయ-2′, ’18 పేజెస్’ చిత్రాలలో నిఖిల్ సిద్ధార్థ్ తో కలసి సందడి చేసిన అనుపమా పరమేశ్వరన్ ఈ యేడాది కూడా మురిపించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ‘మరీచిక’ అనే తెలుగు చిత్రంలో నటిస్తోన్న అనుపమ, ఓ తమిళ సినిమాతో పాటు ఓ మళయాళ చిత్రంలోనూ మురిపించడానికి సై అంటోంది.
Read also: Rajanna Temple: రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు.. చెరువు ప్రాంతంలో దిగేందుకు..
అనుపమా పరమేశ్వరన్ 1996 ఫిబ్రవరి 18న కేరళలోని త్రిస్సూర్ జిల్లా ఇన్ జలకుడలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు సునీత, పరమేశ్వరన్. కొట్టాయమ్ లోని సీఎమ్ఎస్ కాలేజ్ లో కమ్యునికేటివ్ ఇంగ్లిష్ చదువుతూ ఉండగానే, సినిమాల్లో అడుగు పెట్టింది అనుపమ. మళయాళ హీరో నివిన్ పౌలీ హీరోగా రూపొందిన ‘ప్రేమమ్’ సినిమాతో తొలిసారి తెరపై తళుక్కుమంది అనుపమ. ఆ సినిమా తెలుగు రీమేక్ ‘ప్రేమమ్’లోనూ అనుపమను ఎంచుకున్నారు. అయితే ఆ చిత్రం కంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన ‘అ ఆ’లో అనుపమా పరమేశ్వరన్ ముందుగా తెలుగువారిని పలకరించింది. ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘కోడి’ చిత్రంలోనూ అనుపమ నాయికగా నటించింది. తెలుగులో అనుపమ నటించిన “శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్… ఐ లవ్ యూ, హలో గురూ ప్రేమకోసమే, రాక్షసుడు, రౌడీ బోయ్స్, అంటే సుందరానికీ” వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాల జయాపజయాలు ఎలా ఉన్నా ఆమెను అభిమానించేవారికి మాత్రం ఆనందం పంచాయి. “శతమానంభవతి, రాక్షసుడు, కార్తికేయ-2” వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటాయి. ప్రస్తుతం తెలుగు చిత్రం ‘మరీచిక’తో పాటు తమిళంలో ‘సైరన్’, మళయాళంలో ‘జెఎస్.కె’ వంటి సినిమాల్లో అనుపమ నటిస్తోంది. చూడగానే మనకు బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపించే అనుపమ రాబోయే సినిమాలలోనూ తనదైన అభినయంతో అలరించే ప్రయత్నం చేస్తోంది. ఆమె మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
Maha Shivratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు