మన హీరోలు ఓటీటీలో సినిమాలు విడుదలపై ఆందోళనకు గురి అవుతున్నట్లు వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను బట్టి అర్థం అవుతోంది. ఇటీవల నాని తన సినిమా ‘టక్ జగదీశ్’ను థియేటర్ లో విడుదల చేయాలా? లేక ఓటీటీ రిలీజ్ చేయాలా? అనే కన్ఫ్యూజన్ లో క్రాస్ రోడ్స్ లో ఉన్నానని లేఖను విడుదల చేస్తూ తనకు మాత్రం థియేటర్స్ లో విడుదల అంటేనే మక్కువ అని స్పష్టం చేశాడు. అలాగే అంతకు ముందు వెంకటేశ్ నటించిన ‘నారప్ప’ ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు కూడా అసంతృప్తి వెల్లడించినా నిర్మాతల నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. మన స్టార్ హీరోలలో చాలా మంది ఇదే రకమైన గందరగోళ స్థితిలో ఉన్నారు. నిజానికి ఓటీటీలో విడుదల చేస్తే ఆడియన్స్ కు తక్కువ ఖర్చుతో వినోదాన్ని అందించినట్లు అవుతుంది. కానీ థియేటర్ లో ఆడియన్స్ తో కలసి సినిమా చూసి ఎంజాయ్ చేసే మజా మాత్రం మిస్ అవుతారు. అంటే ఓ వైపు ఇంట్లో కూర్చుని సినిమా చూసే వారి సంఖ్య పెరుగుతున్నా మరోవైపు సినిమాల తొలి రోజు వసూళ్ళు, సినిమా రికార్డులు వంటి మ్యాట్రిక్స్ ని మన హీరోలు కోల్పోతున్నారన్నమాట. అదే వారిలో ఎక్కువ ఆందోళను కలిగిస్తోంది. ఎందుకంటే ఆ మ్యాట్రిక్స్ మిస్ అయితే స్టార్ డమ్ కి బీటలు వారినట్లే. అదే వారిలో అలజడికి అసలు కారణం. స్టార్ డమ్ బీటలు వారితే ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గుతుంది. దాంతో సినిమా ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడుతుంది. అలాగని నిర్మాతలకు అభయం ఇస్తూ తమ పారితోషికాలు తగ్గించుకుంటారా అంటే… ససేమిరా అంటున్నారు. ఇంకా కరోనా తర్వాత కొంచెం డిమాండ్ ఉన్న హీరోలు కూడా పారితోషికాలను పెంచేశారు. కొందరైతే రెట్టింపు చేసినట్లు సమాచారం. నిర్మాతలకు ఏ రాయి అయినా ఒకటే… పళ్ళూడగొట్టుకోవడానికి! గత కొన్నేళ్ళుగా సినిమాల ద్వారా లాభపడిన నిర్మాతలను వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. అదే డిమాండ్ ఉన్న హీరో, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులను తీసుకోండి. కోటానుకోట్లకు పడగలెత్తిన వైనం మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. అయినా వారికి ఎందుకు డిమాండ్ అంటే… ఏ నిర్మాత అయినా పరుగు ఆపితే అంతే సంగతులు. అక్కడితో కెరీర్ కి పుల్ స్టాప్ పడిపోద్ది. మళ్ళీ ప్రొడక్షన్ బండి పట్టాలెక్కాలంటే సంవత్సరాలు పడుతుంది. వేరే దారిలేక నిర్మాతలు హీరోలను ఆశ్రయిస్తూ అడిగినంత పారితోషికాలకు గుడ్డిగా తలూపాల్సి వస్తోంది.
Read Also : ‘టక్ జగదీశ్’ను పోస్ట్ పోన్ చేయాలంటున్న ఎగ్జిబిటర్స్!
సరిగ్గా ఇదే టైమ్ లో కరోనాతో హీరోయిజానికి బీటలు పడుతున్నాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోలైన సల్మాన్, అక్షయ్… తమిళనాట సూర్య, ధనుష్… మలయాళంలో మోహన్ లాల్ వంటి వారు ఓటీటీకి సై అంటుంటే మన స్టార్ హీరోలు మాత్రం అందుకు సిద్దపడటం లేదు. ఇతర భాషల్లో నిర్మాతల అభీష్టానికి హీరోలు వదిలేస్తుంటే మన దగ్గర మాత్రం అభిమానులను నిరాశపరుస్తున్నామనే బాధను వెళ్ళగక్కుతున్నారు. అలాగని థియేటర్లలోనే విడుదల చేయండి మేము పూర్తిగా సహకరిస్తాం. మా పారితోషికం సైతం రిలీజ్ తర్వాత సెటిల్ చేయండి అని ముందుకు వస్తారా? అంటే నో అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే వారికి అవ్వా కావాలి… బువ్వా కావాలి. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి. అంతే కాదు కొత్తదనంతో కూడిన స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకోవాలి. ఒక్కటి మాత్రం నిజం థియేటర్ అనుభవం మరపురానిది. ఆ విజిల్స్… స్టార్ డమ్ కావాలి అంటే నిర్మాతలకు మేమున్నాం అనే భరోసా ఇవ్వండి. అప్పుడు థియేటర్లు, నిర్మాతలు, పంపిణీదారులతో సహా అందరూ బాగుంటారు. అటు ఓటీటీ… ఇటు థియేటర్ రెండూ బతికి బట్టకడతాయి. హీరోలు… నిర్ణయం మీదే.
