Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్‌!

Nani

Nani

Kayadu Lohar: న్యాచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో భాగంగా పలు కీలక, ఆసక్తికర అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. సినిమాలో చూపించే స్మోకింగ్ సీన్లు, ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతం, అలాగే పోస్టర్‌లో వైరల్ అయిన తన జడల లుక్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఆయన వివరించారు. ముఖ్యంగా పోస్టర్లపై స్మోకింగ్ సన్నివేశాలను ప్రోత్సహించడం తన ఉద్దేశం కాదని చెబుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా పోస్టర్‌లో కాయదు లోహర్ సిగరెట్ తాగే దృశ్యంపై స్పందిస్తూ నాని ఓపెన్‌గా సారీ చెప్పారు. “ఒక పాత్ర స్మోక్ చేసినంత మాత్రాన ఆ వ్యక్తి విలన్ అయిపోరు. మా నాన్న కూడా స్మోక్ చేస్తారు, కానీ ఆయన విలన్ కాదు. అయితే స్మోకింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన, చెత్త అలవాటు. సినిమా కథ, ఆ ప్రపంచం డిమాండ్ చేసింది కాబట్టే ఆ పాత్ర అలా ప్రవర్తిస్తుంది. అంతేకానీ ఎవరూ దాన్ని చూసి ప్రభావితం కావద్దు. అలాంటి లుక్‌ను పోస్టర్‌లో పెట్టినందుకు సారీ” అని చెప్పారు. దీంతో ఈ సినిమాలో కాయదు విలనా కాదా అనే డైలమాకి సమాధానం దొరికినట్లు అయ్యింది. కేవలం ఒక లుక్‌ను బట్టి ఆమె పాత్రను డిసైడ్ చేయవద్దని నాని చెప్పారు.

అలాగే ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రతీ పెద్ద సినిమాను వెంటాడుతున్న పైరసీ సమస్యపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “పైరసీ అనేది బొద్దింక లాంటిది. ఎంత కష్టపడి అణిచివేసినా, మూడు నెలల తర్వాత మళ్లీ ఎక్కడో ఒకచోట పుట్టుకొస్తుంది. గతంలో పైరసీ చేసిన ఒకడిని పట్టుకుంటే.. సోషల్ మీడియాలో వాడిని కొందరు హీరోగా మార్చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం ఎంతగానో సహకరిస్తూ నిందితులను పట్టుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో కూడా ఒక కమిటీ చర్చలు జరుపుతోంది. అతి త్వరలోనే పైరసీపై కఠినమైన చట్టాలు, మార్పులు వస్తాయని ఆశిస్తున్నాను” అని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్’ పోస్టర్‌లో నాని వేసుకున్న రెండు జడల లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై నాని స్పందిస్తూ.. “ఈ రోజుల్లో ఎవరూ జడలు వేసుకోవడం లేదు. అమ్మాయిలు జడల్లో ఎంతో అందంగా కనిపిస్తారు. చిన్నప్పుడు మన అమ్మలు ఎంతో శ్రద్ధగా జడలు వేసేవారు. కానీ ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో ఆ పద్ధతినే పక్కన పెట్టేశారు. నూనె పెట్టి జడలు వేసుకోకపోవడం వల్లే హెయిర్ ఫాల్ సమస్యలు పెరుగుతున్నాయి. మళ్లీ అందరూ ఆ సాంప్రదాయ జడల ట్రెండ్‌ను మొదలుపెట్టాలి. పోస్టర్‌లో నా జుట్టు ఎంత బలంగా ఉందో చూశారుగా.. అందరూ మళ్లీ మన పాత పద్ధతికి రావాలి” అంటూ సరదాగా మాట్లాడారు.