విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ (ఏకే-47) సినిమా ప్రెస్ మీట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనదైన శైలిలో ఫన్నీ అండ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనకు ఈ ‘ఆదర్శ కుటుంబం’లో ఒక రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చింది త్రివిక్రమ్ గారేనని చెబుతూ ఆయనపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. బయట ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా సరే, ఈ సినిమా కోసం ఆ కుటుంబ వాతావరణాన్ని అర్థం చేసుకుని పనిచేయాల్సిందేనని, ఆ విషయంలో కెమెరామెన్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా కలిసి పనిచేశామని తమన్ తెలిపారు. త్రివిక్రమ్ పెన్నుకు ఉన్న పవర్ ఎలాంటిదో తమన్ వివరిస్తూ.. “కేవలం ఒక సిరా చుక్కతో ప్రజలను ఎంతగానో ఆలోచింపజేయగల సత్తా ఆయన సొంతం. ఆయన తన మాటలతో సీన్‌ను ఎలాగైనా మలుపు తిప్పగలరు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ తమ చేతుల్లో లేదని, సినిమానే తమను మరింత మెరుగ్గా పని చేయమని డిమాండ్ చేసిందని తమన్ చెప్పారు. “సినిమానే మమ్మల్ని ఇంకా బాగా చెక్కండి, జిమ్‌కు పంపించి ట్రెడ్ మిల్ ఎక్కించండి అన్నట్లుగా లాస్ట్ 20 రోజులు నాతో విపరీతంగా పని చేయించుకుంది” అని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రెజర్ వల్లే మాల, నారాయణమ్మ లాంటి పాటలను ముందే రిలీజ్ చేయలేకపోయామని, అందుకే ఇప్పుడు ఒకేసారి జూక్ బాక్స్‌ను రిలీజ్ చేశామని ఆయన వెల్లడించారు. సెట్లో హీరో వెంకటేష్ గారు హెడ్ మాస్టర్ పక్కన ఉండే ‘డ్రిల్ మాస్టర్’ లాగా ఎంతో క్రమశిక్షణతో ఉంటారని, తమ క్రికెట్ టీమ్‌కు కూడా ఆయనే డ్రిల్ మాస్టర్ అని తమన్ ఫన్నీ కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఎనర్జీ ఫెంటాస్టిక్ అని, ఆమె చాలా సింపుల్‌గా ఉంటూనే ఎక్స్ట్రీమ్ ఎనర్జీతో పనిచేశారని కొనియాడారు. అలాగే నారా రోహిత్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఒక ఐ-ఓపెనర్లా ఉంటుందని, చాలా క్రేజీగా చేశాడని, ఈ సినిమా తర్వాత ఆయనకు మరిన్ని పెద్ద పాత్రలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ అక్టోబర్ 30న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా కచ్చితంగా అందరికీ ఫుల్ మీల్స్ పెడుతుందని తమన్ ధీమా వ్యక్తం చేశారు.

