Box Office Crisis: శుక్రవారం వస్తున్నాయి.. ఆదివారమే వెళ్లిపోతున్నాయి! చిన్న సినిమాలకు అసలేమైంది?

Box Office

Box Office

Box Office Crisis: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి వారం సినిమాల జాతర కనిపిస్తోంది. గత వారం కూడా ఏకంగా అరడజనకు పైగా చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి థియేటర్ల ముందుకు వచ్చాయి. గురువారం కొన్ని, శుక్రవారం మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి. కానీ, ఈ చిత్రాలు ఎప్పుడు వచ్చాయో, ఆదివారం ముగిసేలోపే ఎప్పుడు వెళ్లిపోతున్నాయో కూడా సామాన్య ప్రేక్షకుడికి తెలియని పరిస్థితి నెలకొంది. హడావిడి లేకుండా సైలెంట్‌గా థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ సినిమాలకు, సోమవారం వచ్చేలోపే కనీస వసూళ్లు రాక థియేటర్ల నుంచి కనుమరుగైపోతున్నాయి. అసలు చిన్న సినిమాలకు ఎందుకీ దుస్థితి వచ్చింది.

షాకింగ్ నిజాలు చెబుతున్న ట్రేడ్ లెక్కలు..

2026 నవంబర్ మధ్య నాటికి వెలువడిన ట్రేడ్ నివేదికలు టాలీవుడ్‌ను కలవరపెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు తెలుగులో 185కు పైగా సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో సుమారు 15 నుంచి 20 భారీ బడ్జెట్, స్టార్ హీరోల చిత్రాలను పక్కన పెడితే.. దాదాపు 160కి పైగా మీడియం, లో-బడ్జెట్ సినిమాలే ఉన్నాయి. అయితే, ఇన్ని వందల సినిమాలు వస్తున్నా తెలుగులో చిన్న చిత్రాల సక్సెస్ రేట్ కేవలం 5% నుంచి 7% మధ్యలోనే ఉండటం గమనార్హం. అంటే 90 శాతానికి పైగా సినిమాలు శుక్రవారం వచ్చి ఆదివారానికే బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేస్తున్నాయి. ఒకప్పుడు చిన్న సినిమాలకు మౌత్ టాక్ వస్తే చాలు, వారం రోజుల పాటు థియేటర్లు కళకళలాడేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్ టికెట్ ధరలు, పార్కింగ్ ఫీజులు, స్నాక్స్ ఖర్చులు సామాన్యుడికి పెనుభారంగా మారాయి. దీంతో కేవలం విజువల్ వండర్స్, భారీ యాక్షన్ ఉన్న స్టార్ హీరోల సినిమాల కోసమే జనాలు థియేటర్ గడప తొక్కుతున్నారు. చిన్న సినిమాలైతే ఎటూ నాలుగు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తాయి కదా అని ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. దీనికి తోడు, ప్రమోషన్లకు సరైన బడ్జెట్ లేకపోవడం, మాటిమాటికీ రిలీజ్ డేట్లు వాయిదా వేసి సడెన్‌గా థియేటర్లలోకి రావడంతో.. అసలు ఆ సినిమా థియేటర్లలో ఉందన్న విషయమే జనానికి తెలియడం లేదు.

సౌత్ ఇండస్ట్రీ అంతటా ఇదే సీన్.. కానీ

ఈ ‘వీకెండ్ వాషౌట్’ ట్రెండ్ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు, దక్షిణాది చిత్ర పరిశ్రమ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. తమిళంలో ఇప్పటివరకు 190 నుంచి 200 పైగా చిత్రాలు రాగా, అందులో 170కి పైగా చిన్న సినిమాలే. వీటి సక్సెస్ రేట్ 6%–8% మాత్రమే. అయితే కంటెంట్ బాగుంటే పెద్ద సినిమాలను సైతం తట్టుకుని నిలబడవచ్చని రూ.10 కోట్ల బడ్జెట్‌తో వచ్చి రూ.82 కోట్లు కొల్లగొట్టిన ‘థాయ్ కిళవి’, రూ.6 కోట్లతో రూ.70 కోట్లు రాబట్టిన ‘యూత్’ నిరూపించాయి. ‘బత్తా’, ‘విత్ లవ్’ కూడా మంచి విజయాలు సాధించాయి. కంటెంట్‌కు పెద్దపీట వేసే మలయాళంలో 141 పైగా చిత్రాలు విడుదలైతే, అందులో 125 చిన్న చిత్రాలు ఉన్నాయి. మిగతా భాషలతో పోలిస్తే ఇక్కడ సక్సెస్ రేట్ కాస్త మెరుగ్గా (10%–12%) ఉంది. ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’, ‘వాళ 2’, ‘ఆడు 3’ వంటి చిత్రాలు భారీ వసూళ్లను సాధించాయి. కన్నడ పరిశ్రమలో 150కి పైగా సినిమాలు రాగా, అందులో 140 చిన్న సినిమాలే. ఇక్కడ సక్సెస్ రేట్ మరీ తక్కువగా (4%–5%) ఉంది. కానీ ‘ప్రేమద ఊరళి’ ఏకంగా రూ.138 కోట్ల గ్రాస్‌తో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘లవ్ మాక్‌టైల్ 3’ కూడా ఆకట్టుకుంది.

ఇదే కొనసాగితే భవిష్యత్తు ఏంటి..

కేవలం స్టార్ హీరోల సినిమాలకే థియేటర్లు పరిమితమైతే.. భవిష్యత్తులో పరిశ్రమకు కొత్త టాలెంట్, కొత్త దర్శకులు, చిన్న నిర్మాతలు దూరమైపోయే ప్రమాదం ఉంది. సంవత్సరానికి 20 పెద్ద సినిమాలు మాత్రమే వస్తే థియేటర్ల మనుగడ కూడా కష్టమవుతుంది. చిన్న సినిమాలు ఆదివారం దాటి నిలబడాలంటే రొటీన్ కథలను వదిలి బలమైన కంటెంట్‌తో రావాలని అంటున్నారు. అలాగే థియేటర్ యాజమాన్యాలు చిన్న సినిమాలను ప్రోత్సహించాలని చెబుతున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో చిన్న సినిమా అనేది కేవలం ఓటీటీ కంటెంట్‌గా మాత్రమే మిగిలిపోతుందనే హెచ్చరికలు బలంగా వినిపిస్తున్నాయి.