తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఎన్నికలు ఈ రోజు జరగబోతున్నాయి. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ పేరుతో, పెద్ద నిర్మాతలంతా ప్రొగ్రెసివ్ ప్యానల్ పేరుతో పోటీపడుతున్నారు. గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల పరిశ్రమ సొమ్మును బడా నిర్మాతలు దోచుకుంటున్నారని చిన్న నిర్మాతలు ఆరోపిస్తుండగా…. ఈ ఎన్నికలు పదవుల కోసం కాదు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమని ప్రొగ్రెసివ్ ప్యానల్ లో ఉన్న అగ్ర నిర్మాతలు వాదిస్తున్నారు. దీంతో మరోసారి ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఛాంబర్ లోని నాలుగు సెక్టార్లైన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్లలో ఓటు హక్కు ఉన్న వారంతా ఈ ఎన్నికల్లో ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటిని ఎన్నుకోబోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగనుండగా సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వెల్లడికానున్నాయి.
మొత్తం 3 వేల 355 మంది సభ్యులుండగా…. ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడ్ని ఎన్నుకోనున్నారు. తెలుగు సినిమాకు వ్యాపార కేంద్రమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఈసారి వాడివేడిగా ఛాంబర్ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాస్తవానికి ప్రస్తుత ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గ పదవికాలం జులైలోనే ముగిసినప్పటికీ పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా వేశారు. ఛాంబర్ లో సర్వసభ్య సమావేశం తీర్మానం మేరకు ఈ ఏడాదిలోపే ఎన్నికలు నిర్వహించాలన్న ఏకాభిప్రాయంతో చివరకు ఈ నెల 28న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిల్మ్ ఛాంబర్ లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో ఛాంబర్ లోని నాలుగు సెక్టార్లైన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్లలో ఉన్న సభ్యులంతా కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. నిర్మాతలు 1703 మంది సభ్యులు, 631 డిస్ట్రిబ్యూటర్లు, 916 ఎగ్జిబిటర్లు, 105 స్టూడియో సెక్టార్ సభ్యులుండగా మొత్తం 3 వేల 355 మంది తమకు నచ్చిన ప్యానల్ లోని సభ్యులను అధ్యక్ష, కార్యదర్శులతోపాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు ఓటు వేస్తారు.
