Site icon NTV Telugu

Komalee Prasad: పవర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ.. తమిళంలో అరంగేట్రం చేసిన తెలుగు హీరోయిన్!

Komalee Prasad Tamil Debut

Komalee Prasad Tamil Debut

తెలుగు నటి కోమలి ప్రసాద్ తమిళంలో అరంగేట్రం చేశారు. శరణ్ రాజ్ సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పవర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘మండవెట్టి’లో కోమలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. టస్కర్స్ డెన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న మండవెట్టి సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని.. షూటింగ్‌ను ప్రారంభించింది. తన కెరీర్‌లో ఈ సినిమా ఒక కీలకమైన, కొత్త అధ్యాయమని కోమలి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు తనకు ఎప్పటికీ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో మండవెట్టి చిత్రీకరణ జరుగుతోంది. కథలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు భావోద్వేగాలకు పెద్దపీట వేశారు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ అంశాల నేపథ్యంలో మిస్టిసిజం, ఎమోషన్స్‌ను మేళవిస్తూ ఓ బలమైన మహిళా ప్రధాన కథగా మండవెట్టి రూపుదిద్దుకుంటోంది. మనకు కావాల్సిన దాన్ని కోల్పోవడం వల్ల కలిగే బాధ, గుర్తింపు కోసం చేసే పోరాటం, జీవన ప్రయాణం వంటి అంశాలను ఈ కథలో చూపించనున్నారు. పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న ఈ సినిమా కథంతా కోమలి ప్రసాద్ చుట్టూ సాగనుంది.

‘వెల్ల కుదిర’ వంటి సెన్సిబుల్, సైకాలజికల్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శరణ్ రాజ్ సెంథిల్ కుమార్ ఈ సినిమాను రొటీన్‌కు భిన్నంగా.. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కిస్తున్నారు. పాత్రల అంతర్గత భావాలు, ఎమోషన్స్‌ను తెరపై సహజంగా ఆవిష్కరించడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తేనప్పన్, గజరాజ్, అమృత కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రాఫర్ ప్రకాశ్, ఎడిటర్ కునా, సంగీత దర్శకుడు దీపక్ వేణుగోపాల్, స్టంట్ కొరియోగ్రాఫర్ గౌతమ్ ఈ ప్రాజెక్ట్‌కు పని చేస్తున్నారు. స్పష్టమైన ఆలోచనతో బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలనే లక్ష్యంతో టీమ్ ముందుకు సాగుతోంది.

Also Read: Gambhir-Shreyas Rift: గంభీర్ భారత క్రికెట్‌కు ప్రమాదకరం.. రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు!

కోమలి ప్రసాద్ కెరీర్‌లో ఈ తమిళ సినిమా ఒక కీలకమైన మైలురాయి. ఇప్పటికే తెలుగు సినిమాల్లో ‘నెపోలియన్’, ‘రౌడీ బాయ్స్’, ‘సెబాస్టియన్ P.C. 524’, ‘హిట్ – సెకండ్ కేస్’, ‘హిట్ – థర్డ్ కేస్’, ‘శశివదనే చితాలు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాదు డిజిటల్ ప్లాట్‌ఫాంలలో ‘లూజర్’, ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’, ‘టచ్ మీ నాట్’ వంటి సిరీస్‌లతో విమర్శకుల ప్రశంసలు పొందారు. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సహజమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్న కోమలి ప్రసాద్.. ‘మండవెట్టి’తో తమిళ సినీ పరిశ్రమలో తన సత్తా నిరూపించుకునేందుకు సిద్దమయ్యారు.

Exit mobile version