Suryakumar Yadav: శ్రేయస్ అయ్యర్‌కు గట్టి పోటీ.. టీమిండియా రీఎంట్రీకి సూరీడి మాస్టర్ ప్లాన్!

Suryakumar Yadav India T20 Re Entry

Suryakumar Yadav India T20 Re Entry

Suryakumar Yadav Fifty: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో వార్తల్లో నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో ముంబై కెప్టెన్‌గా బరిలోకి దిగిన సూర్య.. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి తనలోని దూకుడు ఇంకా తగ్గలేదని నిరూపించాడు. ఈరోజు కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్య మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

హైదరాబాద్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్లు అంగ్‌క్రిష్ రఘువంశీ, హార్దిక్ తమోర్ మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. రఘువంశీ 13 బంతుల్లో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం హార్దిక్ తమోర్, ముషీర్ ఖాన్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. హార్దిక్ 16 బంతుల్లో 22 పరుగులు చేయగా.. ముషీర్ కేవలం 24 బంతుల్లో 51 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ముషీర్ ఔటైన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీలతో హోరెత్తించాడు.

సూర్యకుమార్ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన సూర్య.. 21 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. 285.71 స్ట్రైక్‌రేట్‌తో సూరీడు చేసిన విధ్వంసంతో ముంబై సునాయాస విజయాన్ని అందుకుంది. శివమ్ దూబే ఐదు బంతుల్లో రెండు సిక్సర్లతో 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. అభిరథ్ రెడ్డి 24 బంతుల్లో 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోడిమెల హిమతేజ 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. కెప్టెన్ చామ మిలింద్ 12 బంతుల్లో 22 పరుగులు చేయగా.. ప్రణవ్ వర్మ 14 బంతుల్లో 18 పరుగులు సాధించాడు. ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించలేకపోయింది. మాక్స్‌వెల్ స్వామినాథన్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

సూర్యకుమార్ యాదవ్‌కు 2026 జూన్‌లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ అందించిన కొద్ది నెలలకే అతడిని భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు జట్టులోనూ చోటు కోల్పోయాడు. అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలలో శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దీంతో మళ్లీ టీమిండియాలోకి రావడమే లక్ష్యంగా సూర్య దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత 2024 జూలైలో సూర్య భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. అతడి నాయకత్వంలో భారత్ 50 మ్యాచ్‌ల్లో 42 విజయాలు సాధించింది. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు, టోర్నీల్లో ఓటమి లేకుండా జట్టును నడిపించడంతో పాటు ఆసియా కప్ 2025, టీ20 ప్రపంచకప్ 2026 టైటిళ్లను అందించాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌పై ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సూర్యకుమార్ తన ఫామ్‌ను చాటుకున్నాడు. 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించడం ద్వారా బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఇదే జోరును కొనసాగిస్తే.. టీమిండియాలోకి తిరిగి వచ్చే అవకాశాలు లేకపోలేదు.